ఆ నగరానికి ‘ది బిగ్‌ ఆపిల్‌’ పేరెలా?

22 Jan, 2020 19:10 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి ‘ది బిగ్‌ ఆపిల్‌’ అనే ముద్దు పేరు ఒకటుంది. ఆ పేరు ఎలా వచ్చింది? ఎన్నేళ్ల క్రితం వచ్చింది? అన్న విషయాన్ని తెల్సుకోవడానికి బేరి పోపిక్‌ అనే చరిత్రకారుడు 30 ఏళ్లపాటు శోధించి కనుక్కున్నారు. 1924, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఓ పత్రిక కటింగ్‌ దొరకడంతో దాని ద్వారా 1920లో ఈ ముద్దు పేరు పుట్టుపూర్వోత్తరాలు తెలిశాయి. అంటే ‘ది బిగ్‌ ఆపిల్‌’ అనే పేరు వందేళ్ల క్రితం వచ్చింది. లూసియానాలోని ఓర్లిన్స్‌లోని ఫేర్‌గ్రౌండ్స్‌ పక్కనున్న ఓ గుర్రాల శాలలో ఇద్దరు నల్లజాతీయులైన జాకీలు గుర్రాలు శుభ్రం చేసుకుంటూ రానున్న న్యూయార్క్‌ సిటీ గుర్రాల రేస్‌ గురించి ఇలా మాట్లాడుకున్నారట.

‘ఈసారి ఎలాగైన బిగ్‌ ఆపిల్‌ కొట్టేందుకు శ్రమించాల్సిందే’ అని మొదటి వ్యక్తి వ్యాఖ్యానించగా ‘అలా అయితే నీవు గుర్రాలను బాగా మేపాల్సిందే. లేకపోతే నీకు చివరకు దక్కేది ఆపిలే అవుతుంది’ అని రెండో వ్యక్తి సమాధానం ఇచ్చారట. అప్పటి నుంచి న్యూయార్క్‌ సిటీకి ‘ది బిగ్‌ ఆపిల్‌’ అనే పేరు నానుడిగా మారింది. ఈ విషయాన్ని జాన్‌ జే ఫిట్జ్‌ గెరాల్డ్‌ అనే జర్నలిస్ట్‌ న్యూయార్క్‌ మార్నింగ్‌ టెలిగ్రాఫ్‌లో ‘ఏరౌండ్‌ ది బిగ్‌ ఆపిల్‌’ అనే కాలంలో రాశారు. దీనికి సంబంధించిన కటింగ్‌ కాపీ బేరి పోపిక్‌కు దొరికింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ‘ది బిగ్‌ ఆపిల్‌’ అనే పదాన్ని ప్రజలు తరచుగా వాడుతూ వచ్చారు. ‘అరౌండ్‌ బిగ్‌ ఆపిల్‌’ కాలం ద్వారా ఆ పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు