బీరు కొనడం కష్టం... తుపాకీ ఈజీ

16 Feb, 2018 19:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఉన్మాదిగా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి నికోలస్‌ క్రజ్‌ నిర్ధాక్షిణ్యంగా 17 మంది విద్యార్థులను కాల్చి చంపిన విషయం తెల్సిందే. అందుకు ఆ విద్యార్థి ఉపయోగించిన ఆయుధం ‘ఏఆర్‌–15’ పిస్టల్‌. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్‌ రాష్ట్రాలు మాత్రమే ఈ పిస్టల్‌ అమ్మకాలను నిషేధించాయి. 21 ఏళ్లున్న వ్యక్తులకు మాత్రమే ఈ పిస్టల్‌ను అమ్మాలని అమెరికా ఫెడరల్‌ చట్టం సూచిస్తోంది. 18 ఏళ్లకే తుపాకులు విక్రయించవచ్చని పలు రాష్ట్రాలు చట్టాలు చెబుతుండడంతో ఆ ఏడుకే ఏఆర్‌–15 లాంటి పిస్టళ్లను కూడా ఆయుధ దుకాణాలు స్వేచ్ఛగా అమ్ముతున్నాయి.

అందుకనే 19 ఏళ్ల నికోలస్‌ క్రజ్‌ కూడా సులభంగానే ఈ లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ను సులభంగానే కొన్నాడు. తాను ఇలాంటి పిస్టల్‌ను కొని తోటివారిని కాల్చబోతున్నట్లు కూడా ఆన్‌లైన్‌లో గతంలోనే హెచ్చరించారట. అలాంటప్పుడు ఆ విద్యార్థి గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ఆయుధ సంస్థలకు ఆయన ఫొటో పంపించడం లాంటి చర్యలేవీ పోలీసులు తీసుకోలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఎంతో మంది మరణిస్తున్నప్పటికీ తుపాకీ విక్రయాలను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

21 ఏళ్లలోపు బీరు తాగడానికి వీల్లేదనే చట్టాన్ని మాత్రం దేశంలో కఠినంగా అమలు చేస్తారుగానీ, తుపాకులను అమ్మరాదనే చట్టాన్ని మాత్రం కఠినంగా ఎందుకు అమలు చేయరాదని పాఠశాల దుర్ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హంతకుడుగా మారిన విద్యార్థి ట్రంప్‌ లాంటి టోపీని ధరించడం కూడా దేశం ఎటు పోతుందా? అన్న దానికి సూచికగా మారిందని వారంటున్నారు.

మరిన్ని వార్తలు