ఆ టీచర్‌ లేకుంటే క్లాస్‌రూమ్‌ రక్తపు మడుగే..

17 Feb, 2018 08:59 IST|Sakshi
విద్యార్థుల ప్రాణాలు కాపాడిన భారతీయ సంతతి టీచర్‌ శాంతి విశ్వనాథన్‌

న్యూయార్క్‌ : అమెరికాలో సంచలనం సృష్టించిన కాల్పుల సమయంలో ఓ భారతీయ సంతతి మహిళా ఉపాధ్యాయురాలు పెద్ద మొత్తంలో ధైర్యసాహసాలు ప్రదర్శించింది. వేగంగా స్పందించి పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా క్షణాల్లో ఆ తరగతి గది మరో రక్తపు మడుగులా మారి చిన్నారులు విగతజీవులయ్యేవారు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని హైస్కూల్‌లో అదే స్కూల్‌లో గతంలో చదివిన ఓ యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 17మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కాల్పులు జరిగే సమయంలో భారతీయ సంతతి మ్యాథ్స్‌ టీచర్‌ శాంతి విశ్వనాథన్‌ ఆల్‌జీబ్రాను బోధిస్తున్నారు. కాల్పుల శబ్దం విన్నవెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. వేగంగా వెళ్లి తలుపులు మూశారు.

అలాగే, ఉన్మాదిని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా కిటికీలను కూడా మూసేశారు. ఆ వెంటనే వారందరిని నేలపై పడుకోవాలని చెప్పారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత పోలీసు అధికారులు వచ్చి తలుపు తీయమన్నా సరే ఆమె తీయలేదు. తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ట్రిక్స్‌ ఉపయోగించి ఓపెన్‌ చేయించే ప్రయత్నం చేస్తున్నాడని భావించి పోలీసులను కూడా అడ్డుకున్నారు. దీంతో కిటికీలు ఓపెన్‌ చేసి పోలీసులని నిర్దారించుకొని పిల్లలను బయటకు పంపించింది. 'ఆమె చాలా వేగంగా స్పందించారు. తన తెలివి తేటలన్నీ ఉపయోగించి చాలామంది పిల్లలను కాపాడారు. పోలీసులు వెళ్లి తలుపు కొట్టినా కూడా సాయుధుడే అని అనుమానించి తలుపు తెరవలేదు. వీలయితే తలుపులు బద్దలు కొట్టుకోండని చెప్పారు. నిజంగా ఆమె సాహసం అద్భుతం' అని డాన్‌ జార్బో అనే ఓ విద్యార్థి తల్లి చెప్పినట్లు సన్‌ సెన్షియల్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు