ట్రంప్‌ వాదనలో నిజమెంత ?

26 Jun, 2018 02:40 IST|Sakshi
డోనాల్డ్‌ ట్రంప్‌

వలసవాదులపై ఆరోపణలన్నీ అవాస్తవాలే 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. అధ్యక్షుడి హోదాలో ఆయన చేసే ప్రకటనల్లో  నిజం కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగానే మారుతోంది. శరణార్థుల పేరు చెబితే అంతెత్తున లేస్తున్న ట్రంప్‌ అమెరికా వలస విధానంపైనా, మెక్సికో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైనా తాజా ప్రకటనలన్నీ తప్పుడు తడకలే. వలసవాదులు వాళ్లు చేస్తున్న నేరాలపై ఈ మధ్య కాలంలో ట్రంప్‌ చేసిన ప్రకటనలేంటి ? వాటి వెనుకనున్న వాస్తవాలేంటి ? 

వలస న్యాయమూర్తులపై
ట్రంప్‌ ‌: అక్రమంగా వలస వచ్చిన వారి విచారణకు వేలకు వేల మంది న్యాయమూర్తులున్నారు. పనికిమాలిన వలస చట్టాల కారణంగా వారిని నియమించాల్సి వస్తోంది. ఇక మా చట్టాలను మార్చేస్తాం. సరిహద్దుల్లో గోడలు కట్టేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇక కోర్టులు, కేసులు ఉండవు. వెనక్కి తిరిగి పంపేస్తాం. 

వాస్తవం :  అక్రమ వలస కేసుల్ని విచారించానికి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నారన్నది పూర్తిగా తప్పు. ఈ విచారణకు ఉద్దేశించిన కోర్టుల్లో  దేశవ్యాప్తంగా 335 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 150 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి బడ్జెట్‌ ఉంది. ఇంకా ఏడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ కేసులన్నీ పూర్తి కావాలంటే ఒక్కో న్యాయమూర్తి 2 వేలకు పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. 

తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై 
ట్రంప్‌: అత్యంత అమానవీయంగా సరిహద్దుల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ట్రంప్‌ జీరో టాలరెన్స్‌ విధానానికి స్వస్తి పలికే ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకం చేస్తూ .. ఇకపై మేము కుటుంబాల్ని కలిపే ఉంచుతాం. దీంతో సమస్య పరిష్కారమైపోతోందని వ్యాఖ్యానించారు. 

వాస్తవం : వలసదారుల సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కావు. వారిపై కేసుల విచారణ ముగిసేవరకు తల్లీబిడ్డల్ని వేర్వేరుగా బదులుగా ఒకే చోట నిర్బంధించి ఉంచుతారు. అంతేకాదు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల నుంచి వారి పిల్లలను  20 రోజులకు మించి వేరు చేసి ఉంచకూడదని 1997 నాటి ఫ్లోర్స్‌ ఒప్పందం చెబుతోంది. అమెరికన్‌ కాంగ్రెస్‌ లేదంటే అక్కడి కోర్టులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ 20 రోజుల విధానం అమల్లోనే ఉంటుందని న్యాయశాఖ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ అధికారులకు మూడు వారాల తర్వాత మళ్లీ తల్లీ బిడ్డల్ని బలవంతంగా వేరు చేయడానికి అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. 

వలసదారుల అరెస్టులపై 
ట్రంప్‌ : 2011 ప్రభుత్వ నివేదిక ప్రకారం హత్యా నేరం కింద 25 వేల మంది, దోపిడి కేసులో 42 వేల మంది, లైంగిక నేరాల్లో 70  వేల మంది, కిడ్నాప్‌ కేసుల్లో 15 వేల మంది అక్రమవలదారుల అరెస్టులు జరిగాయి. గత ఏడేళ్లుగా కేవలం టెక్సాస్‌లోనే రెండున్నర లక్షల మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్‌ చేశాం. వారిపై ఆరులక్షలకు పైగా క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

వాస్తవం: అక్రమ వలసదారుల అరెస్టులపై ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికలో అంశాలనే ట్రంప్‌ ప్రస్తావించారు.  సరిహద్దులు దాటుకొని వచ్చిన నేరగాళ్లలో 30 లక్షల మందికి పైగా జరిగిన అరెస్టులు వాస్తవమే కానీ, అందులో సగానికిపైగా అక్రమవలస, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్‌ నేరాల కింద జరిగాయి. చాలా వరకు కేసులు పౌర చట్టాల అతిక్రమణలకు సంబంధించిన కేసులే తప్ప, క్రిమినల్‌ అభియోగాలు కాదు. 

వలసదారుల నేరాలపై 
ట్రంప్‌ : ఎప్పుడూ నా చెవుల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అమెరికా పౌరుల కంటే వాళ్లు (వలస వచ్చిన వారు) మంచివాళ్లు అని.. అదెంత మాత్రం సరైంది కాదు. వాళ్లే అధిక నేరాలు చేస్తున్నారు. వాళ్లున్న చోటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. 

వాస్తవం :  అమెరికాలో వివిధ సామాజిక సంస్థలు, కాటో ఇనిస్టిట్యూట్‌ వంటి మేధో సంస్థల గణాంకాల ప్రకారం అమెరికా పౌరులతో పోల్చి చూస్తే వలసదారులు చేసే నేరాల సంఖ్య చాలా తక్కువ. 1990 సంవత్సరం నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్రైమ్‌ రేటు చాలా తక్కువగా నమోదైంది. అత్యధిక వలసదారుల జనాభా ఉన్న న్యూయార్క్‌ నగరంలో (5 లక్షల మంది వరకు అక్రమంగా ఉన్నారని అంచనా) గత ఏడాది 292 హత్యలు జరిగాయి. అమెరికాలో ఎన్ని హత్యలు జరిగాయన్నదానిపైనే శాంతి భద్రతల్ని అంచనా వేస్తారు. అలా చూస్తే వలస వచ్చిన వారు స్థిరపడిన ప్రాంతాల్లోనే హత్యలు తక్కువగా జరిగాయి. 

ఆర్థిక వ్యవస్థకు వాళ్లే ఆలంబన
గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ‘ వలసదారులు లేకుండా ఒక్కరోజు‘  పేరుతో ఇమిగ్రెంట్స్‌ అందరూ 24 గంటల సమ్మెకు దిగేసరికి అమెరికా వణికి పోయింది. రెస్టారెంట్లు, నిర్మాణ కంపెనీలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో వలస వచ్చిన వారుపనికి హాజరుకాకపోయేసరికి ఆ ఒక్క రోజే దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వలసదారుల శ్రమ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి.  అమెరికా పౌరులు వలస వచ్చిన వారిని ఎంత చిన్న చూపు చూసినా రెస్టారెంట్లలో వంటలు చెయ్యడానికీ మెక్సికన్లు కావాలి, వ్యవసాయ క్షేత్రాల్లోపని చేయడానికి వాళ్ల సహకారమే ఉండాలి.

అమెరికన్ల ఇళ్లు శుభ్రం చేయాలన్న, గిన్నెలు తోమాలన్నా, తోటల్లో మాలీలుగానైనా, పిల్లల్ని సంరక్షించాలన్నా మెక్సికన్లే దిక్కు అని అమెరికాలోని ప్రముఖ షెఫ్‌ ఆంథోని బౌర్డెన్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగంలో వసలదారులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు కాజేస్తున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు కానీ, గత రెండు దశాబ్దాల్లో  రెస్టారెంట్లలో వంటలు, డిష్‌ వాషింగ్‌ వంటి ఉద్యోగాల కోసం ఒక్క అమెరికన్‌ కూడా ముందుకు రాలేదు. మెక్సికన్లు అంటూ లేకపోతే అమెరికాలో సేవా రంగం కుదేలైపోతుందని ఆంథోని చెబుతున్నారు. అమెరికన్‌ రెస్టారెంట్లలో 75 శాతం వలసదారులే పని చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు వలసదారులేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

చదవండి: ట్రంప్‌ అభిశంసనకు 42 శాతం మొగ్గు

మరిన్ని వార్తలు