2030లో స్మార్ట్‌సిటీలు ఎలా ఉంటాయి?

12 Dec, 2016 15:06 IST|Sakshi
2030లో స్మార్ట్‌సిటీలు ఎలా ఉంటాయి?
ప్రపంచంలోని 60 శాతం జనాభా 2030 నాటికి స్మార్ట్‌ సిటీలలో నివసిస్తారని మేధావులు భావిస్తున్నారు. అప్పటికి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలు, వారి నిర్ణయాలపైనే ప్రజల జీవితాలు ఆధారపడతాయా? అన్న అంశంపై ప్రపంచంలోని సాంకేతిక నిపుణులు, మేధావుల మధ్య చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రజల జీవితాలను నిర్దేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 
ఇప్పటివరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను అమలు చేయగా, స్మార్ట్‌ సిటీల్లో ప్రజల అవసరాల కన్నా సాంకేతిక పరిజ్ఞానానికే ఎక్కువ విలువనిస్తారు. ముందస్తు ప్రణాళికల ద్వారా ఇంతకుముందు పట్టణాలను నిర్మించగా స్మార్ట్‌ సిటీలను అప్పటికప్పుడు కావల్సిన అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అన్ని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలే ఉంటాయి. ఉదాహరణకు చైనా రాజధాని బీజింగ్‌ నగరంలోలాగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటే వాయువులోని కాలుష్యాన్ని గ్రహించి స్వచ్ఛమైన వాయువును వదిలే టవర్లు ప్రతి అపార్ట్‌మెంట్‌లో, ప్రతి ఇంటిలో ఉంటాయి. బీజింగ్‌ వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు 23 అడుగుల ఎత్తయిన టవర్‌ ద్వారా ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
 
చెట్లు, పుట్టలతో గ్రామీణ వాతావరణం కనుమరుగై పట్టణాల పేరుతో కాంక్రీట్‌ నగరాలు ఏర్పడ్డాయి. దానివల్ల పర్యావరణ పరిస్థితులు కూడా దెబ్బతిన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాంక్రీట్‌ కట్టడాలే స్మార్ట్‌ సిటీల్లో పచ్చని చెట్లతో కళకళలాడే రోజులు వస్తాయి. ఈ రోజు నగరంలో ఉష్ణోగ్రత ఎంతుంది? వాయుకాలుష్యం శాతమెంత? ధ్వని కాలుష్యం ఎంతుంది? ట్రాఫిక్‌ ఎక్కడెక్కువుంది? ఎక్కడ తక్కువుంది? ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పంపించే సెన్సర్లు ఉంటాయి. ఆ డేటాను బట్టి రియల్‌ టైమ్‌లో, రియల్‌ పరిష్కారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పలు పరిస్థితులను ఒకే పరికరం అంచనా వేసే పద్ధతి ఇప్పటికే చికాగో నగరంలో ప్రవేశపెట్టారు. ఈ పరికరాలు అక్కడ వీధి విద్యుత్‌ స్తంభాలకు ఏర్పాటు చేశారు. 
 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ కూడా మారవచ్చని, మళ్లీ ప్రజలు సమూహాలుగా జీవించే అవసరం రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు.
మరిన్ని వార్తలు