మనిషి జీవితకాలం.. 500 ఏళ్లు!

10 Mar, 2015 16:32 IST|Sakshi
మనిషి జీవితకాలం.. 500 ఏళ్లు!

మనిషి సగటు ఆయుష్షు మహా అయితే ఎంత ఉంటుంది? ప్రస్తుత ప్రమాణాల ప్రకారం అయితే 60-70 ఏళ్ల వరకు అనుకోవచ్చు కదూ.. కానీ వైద్య, వైజ్ఞానిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల భవిష్యత్తులో మనిషి 500 ఏళ్ల వరకు జీవించి ఉంటాడట!! ఈ విషయాన్ని గూగుల్ వెంచర్స్ సంస్థ అధ్యక్షులు బిల్ మారిస్ ‘బ్లూమ్‌బెర్గ్’ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, జన్యు పరిశోధన, క్యాన్సర్ పరిశోధన సంస్థలపై భారీ పెట్టుబడులు పెట్టిన గూగుల్ వెంచర్స్ సంస్థ మానవుల ప్రామాణిక జీవితకాలాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

బ్రిటన్‌లో ఈ పదేళ్ల కాలంలో మానవ ప్రామాణిక జీవితం కాలం ఐదింతలు పెరిగిందని, భవిష్యత్తులో ఇది 500 ఏళ్లకు పెరిగే అవకాశం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తాను మాత్రం వందేళ్లలోపు చనిపోవాలని కోరుకోవడం లేదని, కొన్ని వందలేళ్లు బతకాలని ఆశిస్తున్నానని తెలిపారు. గూగుల్ వెంచర్స్ 2009లో స్థాపించిన మారిస్, ఆ సంస్థ ప్రపంచ లావాదేవీలన్నింటినీ తానే స్వయంగా చూసుకుంటున్నారు. ఆయన సలహా మేరకే గూగుల్ సంస్థ యాపిల్ కొలాబరేషన్‌తో 2013లో కాలికో ప్రాజెక్టుకు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద వృద్ధాప్యంపై, ఆ కారణంగా వచ్చే వ్యాధులపై విస్తృత పరిశోధనలు చేస్తోంది. మిడిల్‌బరి కళాశాలలో న్యూరోలోజి దివిన మారిస్, డ్యూక్ విశ్వవిద్యాలయంలో న్యూరాలోజిపై విస్తృత పరిశోధనలు చేశారు.

మారిస్ కొలీగ్, గూగుల్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ రే కుర్జెవీల్ మాత్రం మారిస్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. మానవ జీవన ప్రమాణకాలాన్ని 120 ఏళ్ల వరకు పెంచొచ్చని చెప్పారు. క్షీణించిన మానవ అవయవాల స్థానంలో త్రీడీ టెక్నాలజీని ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం ద్వారా ఇది సాధించవచ్చని ఆయన చెప్పారు. ఇది ఈ శతాబ్దంలోనే నెరవేరవచ్చని తెలిపారు. ఎలాంటి కృత్రిమ అవయవాల అవసరం లేకుండానే శాస్త్రవేత్తలు ‘సీ ఎలిగాన్’ అనే ఓ రకం క్రిమి జీవితకాలాన్ని లాబరేటరీలో ఐదింతలు పెంచడంలో ఇటీవల విజయం సాధించారు. ఆ క్రిమి జెనెటిక్ కోడ్ పూర్తిగా మ్యాపింగ్ చేయడం ద్వారా ఇది సాధ్యమైందని, మానవుడి జెనెటిక్ కోడ్‌ను కూడా పూర్తిగా మ్యాపింగ్ చేస్తే మానవ ప్రామాణిక జీవనకాలాన్ని నాలుగైదింతలు చేయవచ్చని ఏజింగ్‌పై పరిశోధనలు సాగిస్తున్న ‘బక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్’ శాస్త్రవేత్త డాక్టర్ పంకజ్ కపాహి తెలిపారు.

మరిన్ని వార్తలు