మనసులో ఏముందో తెలిసిపోతుంది!

16 May, 2019 09:02 IST|Sakshi

కాలిఫోర్నియా: మనసులో ఏమనుకుంటున్నామో బయటకి వినిపిస్తే ఎలా ఉంటుంది? అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆదిత్య 369’ సినిమాలో అచ్చం ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అప్పుడదంతా సినిమా అని కొట్టిపారేశారు. కానీ... ప్రస్తుతం ఇది అక్షరాల నిజం కాబోతోంది. మనుషుల ఆలోచనలను చదివి, వారు ఏమనుకుంటున్నారో మాటల రూపంలో బయటకు వినిపించే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం మెదడుకు అమర్చే ఓ పరికరాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు. మాట పడిపోయిన చాలా మందికి ఈ సాంకేతికత ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనసును చదివే ఈ సాంకేతికత రెండు దశల్లో పనిచేస్తుంది. మొదట మెదడులో ఓ ఎలక్ట్రోడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. పెదవులు, నాలుక, స్వరపేటిక, దవడలకు మెదడు పంపే ఎలక్ట్రిక్‌ సంకేతాలను ఇది గ్రహిస్తుంది. రెండో దశలో.. ఇలా గ్రహించిన సంకేతాలను ఓ శక్తిమంతమైన కంప్యూటింగ్‌ వ్యవస్థ విశ్లేషించి, ఆయా కదలికల వల్ల ఏర్పడే ధ్వనులను కృత్రిమంగా ఏర్పరుస్తుంది. ఓ కృత్రిమ గొంతు వీటిని బయటకు వినిపిస్తుంది.
 
అనేక వ్యాధులకు పరిష్కారం..  ఈ సరికొత్త సాంకేతికత ద్వారా నాడీ సంబంధ వ్యాధులు, మెదడు గాయాలు, గొంతు క్యాన్సర్, పక్షవాతం, పార్కిన్సన్స్, మల్టిపుల్‌ సెలోరోసిస్‌ వంటి అనారోగ్య సమస్యల బారినపడ్డవారికి ఈ కొత్త సాంకేతికత సాయపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మెదడులోని ఆలోచనలను గుర్తించడం మాత్రం ప్రస్తుతానికి కష్టమైన విషయమేనంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత ఆరంభ దశల్లోనే ఉందని, వినియోగానికి ఇప్పుడే అందుబాటులోకి రాకపోవచ్చని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ ప్రొఫెసర్‌ సోఫీ స్కాట్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు