మానవుల్లోనూ అవయవాల పునరుత్పత్తి!

10 Aug, 2016 04:33 IST|Sakshi
మానవుల్లోనూ అవయవాల పునరుత్పత్తి!

జీబ్రా ఫిష్, అక్సోలాట్, రే ఫిన్‌డ్!... మూడూ చేపరకాలే. ఒకటి భారత్‌లో, రెండోది మెక్సికోలో, మూడోది ఆఫ్రికాలో కనిపించే వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..? ఎప్పుడు అవసరమైతే అప్పుడు తమ శరీర అవయవాలను తయారు చేసుకోగలవు. తోకలను పెంచుకునే బల్లుల మాదిరి అన్నమాట. ఇదే నైపుణ్యాన్ని వినియోగించుకుని మానవులు కూడా తమ అవయవాలు తయారు చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యమేనంటున్నారు ఇంగ్లండ్‌లోని మెయినీకి చెందిన ఎండీఐ బయోలాజికల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు.

దీంతో జబ్బుల బారిన పడ్డ గుండె, కాలేయం వంటి అవయవాలను మళ్లీ పెంచుకోవచ్చు. అవయవాలను తయారు చేసుకునే లక్షణం ఉండేందుకు కొన్ని జన్యు నియంత్రణ వ్యవస్థలు కారణమని, వాటిని తాము గుర్తించామని పరిశోధకులు వివరించారు. పై మూడు రకాల చేపల్లోనూ ఒకేరకమైన నియంత్రణ వ్యవస్థ ఉండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.

మానవుల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు బెంజమిన్ ఎల్ కింగ్ అనే పరిశోధకుడు తెలిపారు. ఈ వ్యవస్థను గుర్తించి మందుల ద్వారా వాటిని చైతన్యం చేయడం, నియంత్రించడం సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అవయవాల పునర్‌సృష్టి సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ‘ప్లాస్ వన్’ సంచికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు