చేతికి లక్ష, తలకు రెండు లక్షలు...మొత్తంగా..

18 Jul, 2015 16:41 IST|Sakshi
చేతికి లక్ష, తలకు రెండు లక్షలు..మొత్తంగా..

డొడోమా: అక్కడ మానవ ప్రాణాలకు అసలు విలువ లేదు. కానీ మానవుడి ఆవయవాలకు మాత్రం ఎంతో విలువుంది. ఒక చేతికి దాదాపు లక్ష రూపాయలు. తలకు రెండు లక్షలు. మొత్తం చర్మానికి దాదాపు ఆరు లక్షలు, మొత్తంగా శరీరానికి కోటీ ముప్పై లక్షల రూపాయలు. ఇందులో బాధితులకు నయా పైసా రాదు. వీటిని సొమ్ము చేసుకునేవాడికి వెళుతుంది. వీటిని తెగనరికి తెచ్చేవాడికి కొంత పర్సంటేజీ దక్కుతుంది.

కిడ్నీలను తస్కరించి అమ్ముకునే వ్యాపారంకన్నా దారుణమైన ఈ వ్యాపారం తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో యధేశ్చగా జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి మానవ అవయవాలను కొనుక్కుంటోంది ఎవరో కాదు. రాజకీయ నాయకులు. బడా వ్యాపారవేత్తలు. ఎందుకంటే మూఢ నమ్మకం. ఎన్నికల్లో గెలవాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా ఈ అవయవాల చూర్ణం, స్థానిక మొక్కల మిశ్రమంతో తయారు చేసిన కషాయాన్ని తాగడం ఒక్కటే మార్గమన్న మౌఢ్యం. ఈ మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నవారు క్షుద్ర వైద్యులు. అల్బినో అనే జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారి అవయవాల్లో అద్భుతమైన అతీంద్రీయ శక్తులు ఉంటాయనే పూర్వకాల నమ్మకాలను ఉపయోగించుకొని ఈ పిశాచ వైద్యులు ఇంతకు తెగబడుతున్నారు. వారు ప్రతి మానవ ప్రాణి జోలికి వెళ్లకపోవడం కొంత నయమనుకోవాలేమో!

వైద్య పరిభాషలో మెలానిన్ అనే వర్ణద్రవ్య లోపం వల్ల అల్బినోలు పుడతారు. వారి శరీరానికి, కళ్లకు, శరీరంపై వెంట్రుకలకు రంగు ఉండదు. శరీరం కూడా పాండురోగం సోకినట్టు తెల్లగా ఉంటుంది. వీరి జుట్టుపై నుండే వెంట్రుకలకు (మొలిచేదే తక్కువ), చేతుల గోళ్లకు అతీంద్రీయ శక్తులు ఉంటాయన్నది టాంజానియాలాంటి తూర్పు ఆఫ్రికా దేశాల్లో పూర్వికుల విశ్వాసం. తమ వద్దకు కోరికలు ఈడేరేందుకు వచ్చే విశ్వాసకులకు వీరి వెంట్రుకలను, గోళ్లను ఉపయోగించి క్షుద్ర పూజలు చేయడం, అర్థంపర్థంలేని కషాయాలు తాగించడం అక్కడి క్షుద్ర వైద్యుల నైజం.

హఠాత్తుగా టాంజానియాలో అల్బినోల ప్రతి అవయవాన్ని క్షుద్ర వైద్యానికి ఉపయోగించడం 2006లో మొదలైంది. క్షుద్ర వైద్యుల మధ్య పోటీ పెరిగి ఒక్కో అవయవానికి ఒక్కో అతీంద్రీయ శక్తి ఉందంటూ అల్బినోల అవయవాలకు రేటు పెంచుతూ వచ్చారు. మరి రేటునుబట్టి అవయవాలను ఎవరు తీసుకరావాలి? అందుకోసం అడ్డంగా ఏ అవయవాన్నైనా తెగనరికే తలారుల ముఠాలను నియమించుకున్నారు. ఈ ముఠాలను స్థానికంగా ఎంగ్యాంగ్ అని పిలుస్తారు.

2013, జనవరి 31వ తేదీన పెండో సెంగెరెమా అనే బాలుడి ఎడమ చేయి నరుక్కెళ్లారు (ఇప్పుడు ఆ బాలుడికి 15 ఏళ్లు). అడ్డొచ్చిన ఆ బాలుడి 95 ఏళ్ల తాతయ్యను కూడా నరికేశారు. 2008లో మిరియాము స్టఫోర్డ్ అనే మహిళ కుడి చేతిని మొండిపోయిన పొడవైన కత్తితో తెగనరికారు. కత్తి మొండి వల్ల రెండో చేయి పూర్తిగా తెగకపోవడంతో దాన్ని వదిలేసి తెగిన చేతిని తీసుకెళ్లారు. రెండు కృత్రిమ అవయవాలతో ఆమె ఇప్పటికీ బతికే ఉన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు 156 మంది అల్బినోలు బలయ్యారని టాంజానియా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ బాధితులు వేల మందే ఉంటారని అనధికార లెక్కలు చెబుతున్నాయి.

లేక్ విక్టోరియా పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంకా పెరిగాయని ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడిన ‘మెయిల్ ఆన్ లైన్’ జర్నలిస్టులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అక్కడ అల్బినోలను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. అల్బినోలుగా పుట్టినవారిని పురిటిలోనే చంపుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలా చేయని వారు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అల్బినో బిడ్డలను తీసుకొని మారుమూల ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు వారి తల్లిదండ్రులు.

ప్రపంచవ్యాప్తంగా సరాసరి తీసుకుంటే ప్రతి 20 వేల మందిలో ఒకరు అల్బినోలుగా జన్మించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ప్రపంచంలోనే అల్బినోలు టాంజానియాలో ఎక్కువ మంది ఉన్నారని, అక్కడ ప్రతి 1400 మందిలో ఒకరి అల్బినోలేనని ఐరాస పేర్కొంది. టాంజానియా మొత్తం జనాభా దాదాపు ఐదు కోట్లు. అందులో క్రైస్తవులు, ముస్లింలే ఎక్కువ. మూఢ విశ్వాసకులకు మాత్రం ఎవరూ అతీతులుకారు. వారిలో 93 శాతం మంది ఈ మూఢనమ్మకాన్ని విశ్వసిస్తారు. ఇంతకాలం ఈ క్షుద్ర వైద్యాన్ని నిషేధించడటానికి నిరాకరిస్తూ వచ్చిన టాంజానియా ప్రభుత్వం చివరకు ఐక్యరాజ్య సమితి ఒత్తిడితో 2015 జనవరి మొదటి వారంలో నిషేధించింది.

>
మరిన్ని వార్తలు