త్వరలోనే ఏలియన్స్‌ను కలుస్తామట.!

27 Feb, 2018 17:48 IST|Sakshi

న్యూయార్క్‌: గ్రహాంతరవాసులు ఉన్నారనే వాదనను మరింత బలపర్చేలా మరో శాస్త్రవేత్త కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మిచియో కాకు.. త్వరలోనే మనం ఏలియన్స్‌ను కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఈ శతాబ్దంలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఏలియన్స్‌తో మన ముఖాముఖి ఎలా ఉంటుందన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. వాళ్లు మనతో స్నేహంగా మాత్రం ఉండబోరని కాకు అంచనా వేశారు.

త్వరలోనే ఏలియన్స్ సంభాషణను రేడియో టెక్నాలజీ సాయంతో వినగలుగుతామని, అయితే వాళ్ల మాటలు విన్నంత మాత్రాన వాటిని అర్థం చేసుకోలేమన్నారు. వాళ్లతో మాట్లాడటం చాలా కష్టమని, ఎందుకంటే వాళ్లు కొన్ని పదుల కాంతి సంవత్సరాల దూరంలో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాళ్ల టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ముందు వాళ్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కాకు సూచించారు. ఏలియన్స్ వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వాళ్లు మనల్ని అడవి జంతువుల్లాగా చూసే ప్రమాదం ఉందని ఈ సైద్ధాంతికి భౌతిక శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తంచేశారు.

>
మరిన్ని వార్తలు