‘పరిస్థితి భయంకరంగా ఉంది.. మాట్లాడలేను’

7 Apr, 2020 17:18 IST|Sakshi

ఇస్లామాబాద్‌: మానవాళి మనుగడను ప్రశార్థకం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మూగజీవాలను కూడా వదలడం లేదు. ఇప్పటికే హాంకాంగ్‌లో కుక్కలు, పెంపుడు పిల్లికి.. అమెరికాలోని జూలో ఉన్న ఓ పులికి మనిషి ద్వారా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక చైనాలోని వుహాన్‌లో కోవిడ్‌-19 ఆనవాళ్లు బయటపడ్డ తొలినాళ్లలో చాలా మంది చైనీయులు, ఇతర దేశాల ప్రజలు పెంపుడు జంతువులను రోడ్ల మీదకు విసిరివేసిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రభుత్వాలు అనుమితినిస్తున్నాయి. (ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్‌!)

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పెట్‌ మార్కెట్లలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పంజరాల్లో బంధించిన పిల్లులు, కుక్కలు, కుందేళ్లు ఆకలితో అలమటించి చనిపోయి పడి ఉండటం జంతు ప్రేమికుల మనసులను ద్రవింపజేస్తున్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన జంతు సంరక్షణా బృందాలు మిగిలిన జంతువులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం గురించి ఆయేషా చంద్రిగర్‌ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. ‘‘మేం లోపలికి వెళ్లే సమయానికే దాదాపు 70 శాతం జంతువులు చనిపోయాయి. వాటి మృతదేహాలు కిందపడి ఉన్నాయి. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అసలు నేనేమీ మాట్లాడలేకపోతున్నాను’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.(అమెరికాలో పులికీ కరోనా!)

కాగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 3864 కేసులు నమోదు కాగా.. 54 మరణాలు సంభవించాయి. పంజాబ్‌లో 1918, సింధ్‌లో 932, ఖైబర్‌ పంక్తువాలో 500, గిల్జిత్‌ బల్టిస్థాన్‌లో 211, బెలూచిస్తాన్‌లో 202, ఇస్లామాబాద్‌లో 83, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 18 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 75 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలికాగా... దాదాపు పదమూడున్నర లక్షల మంది ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు.(మరో 6 పులులకు కరోనా లక్షణాలు?!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు