కుప్పకూలిన ప్రాజెక్టు: వందల్లో మృతులు?

24 Jul, 2018 16:30 IST|Sakshi

వియాంటైన్‌, లావోస్‌ : నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్‌ డ్యామ్‌ కుప్పకూలడంతో కనీవినీ ఎరుగని విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆగ్నేయ లావోస్‌లో మంగళవారం జరిగింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా లెక్కతేలలేదు. వందలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య వేలలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6,500 మంది నిర్వాసితులు అయ్యారు. జల విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు లావోస్‌లో దేశవ్యాప్తంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి అటాపీ ప్రావిన్సులో నిర్మిస్తున్నారు.

సోమవారం అర్థరాత్రి డ్యామ్‌ కుప్పకూలినట్లు అక్కడి మీడియాలో రిపోర్టులు వచ్చాయి. డ్యామ్‌ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా, వందల సంఖ్యలో ఇళ్లు సైతం నీటి ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో లావోస్‌ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. 

వియత్నాంకు చెందిన పీఎన్‌పీసీ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా దాదాపు 120 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 410 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ డ్యామ్ వచ్చే ఏడాది నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సివుంది. థాయ్‌లాండ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే ప్రధాన ఉద్దేశంతోనే దీన్ని నిర్మించతలపెట్టారు.

మరిన్ని వార్తలు