416 వేల్స్‌ ఒడ్డుకు ఎందుకు వచ్చాయి?

10 Feb, 2017 17:44 IST|Sakshi
ఇంటర్నెట్‌ ప్రత్యేకం: సముద్ర అంతర్భాగంలో భారీ ఆకారంతో కనిపించే జీవులు వేల్స్‌. వేల్స్‌ను అందరూ రియల్‌గా చూడకపోయినా హాలీవుడ్‌ సినిమాల్లో కచ్చితంగా చూసే ఉంటారు. న్యూజిలాండ్‌లో ఓ బీచ్‌ ఒడ్డుకు వందలాది వేల్స్‌ గురువారం రాత్రి కొట్టుకువచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అక్కడి అధికారులు, కొంతమంది వాలంటీర్లు వాటన్నింటిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నం చేశారు. 
 
కానీ అందులో వారు విఫలమయ్యారు. ఒడ్డుకు వచ్చిన వేల్స్‌ను సముద్రంలోకి కొంతమేర తీసుకువెళ్లి వదిలినా అవి తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఒడ్డుకు వచ్చిన 416 వేల్స్‌లో శుక్రవారం ఉదయానికి 300పైగా ప్రాణాలు విడిచాయి. దీంతో ఒక్కసారిగా గోల్డెన్‌ బే బీచ్‌లో విషాదం అలముకుంది. మిగిలిన వేల్స్‌ను రక్షించేందుకు అధికారులు, వాలంటీర్లు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
 
వేల్స్‌ సహజంగా గుంపుగా జీవిస్తాయి. వీటికి ఒక నాయకుడు ఉంటాడు. ఒకసారి ఒడ్డుకు వచ్చిన వేల్స్‌ తిరిగి నాయకుడు దారి చూపే వరకూ అక్కడే ఉండిపోతాయి. వేల్స్‌ వాటంతటవే ఎందుకు ఒడ్డుకు వచ్చేస్తున్నాయో తెలియడం లేదని ఓ అధికారి చెప్పారు. దాదాపు 100 వేల్స్‌లను అతికష్టం మీద తిరిగి సముద్రంలోనికి పంపినట్లు వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో వేల్స్‌ ఒడ్డుకు కొట్టుకురావడం ఈ దశాబ్దంలో ఇదే తొలిసారని చెప్పారు. కాగా, 1918లో వెయ్యి, 1985లో 450 వేల్స్‌ న్యూజిలాండ్‌లోని బీచ్‌ల ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వేల్ సంరక్షణ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా 300 డాల్ఫిన్లు, వేల్స్‌ తీరానికి వచ్చి ప్రాణాలు విడుస్తున్నాయని చెప్పారు.
>
మరిన్ని వార్తలు