లావోస్‌లో పెను విషాదం

25 Jul, 2018 01:04 IST|Sakshi
అటాపీ జిల్లాలో ఇంటిపైకెక్కిన స్థానికులు

కుప్పకూలిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు

వందలాది మంది గల్లంతు

మృతుల సంఖ్య భారీగా

సహాయక చర్యలు ముమ్మరం

బ్యాంకాక్‌: లావోస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు (హైడ్రో పవర్‌ డ్యామ్‌) ఒక్కసారిగా కుప్పకూలిపోయి వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇంకా లెక్క తేలలేదు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6,600 మంది నిర్వాసితులయ్యారు.

ఆగ్నేయ లావోస్‌లోని అటాపీ ప్రావిన్స్‌ సనామ్‌క్సేయ్‌ జిల్లాలో నిర్మిస్తున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు సోమవారం అర్ధరాత్రి కుప్పకూలినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. డ్యామ్‌ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. సుమారు ఆరు గ్రామాలు వరద ధాటికి తుడిచిపెట్టుకు పోయాయని.. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది.

వందల సంఖ్యలో ఇళ్లు సైతం నీటి ధాటికి కొట్టుకుపోయాయి. ‘‘మాకు ఎంతమంది చనిపోయారు. ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై అధికారిక సమాచారమేదీ లేదు. ఇక్కడ కనీసం ఫోన్‌ సిగ్నల్‌ కూడా పనిచేయడం లేదు. అయితే వరదలో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి పలు సహాయక బృందాలను పంపాం’’అని అటాపీ ప్రావిన్స్‌ అధికారి ఒకరు చెప్పారు.

కకావికలమైన జనజీవితం
ఈ దారుణ సంఘటన అక్కడి జనజీవితాల్ని కకావికలం చేసింది. చనిపోయినవారు చనిపోగా అక్కడక్కడా మిగిలిన ఇంటి పైకప్పులపైకి ఎక్కి కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. చిన్న పిల్లలతో చెక్క బోట్లలో సురక్షిత ప్రాంతాలకు మరికొందరు తరలిపోయారు.

ఈ నేపథ్యంలో హుటాహుటిన రంగంలోకి దిగిన లావోస్‌ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. లావోస్‌ ప్రధాన మంత్రి థాంగ్లౌన్‌ సిసోలిత్‌ మంగళవారం నాటి నెలవారీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కేబినెట్‌ సహచరులు, అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని, వరద బాధితుల సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ప్రాజెక్టు విలువ రూ. 8,259 కోట్లు
వియత్నాంకు చెందిన పీఎన్‌పీసీ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా దాదాపు 120 కోట్ల (సుమారు రూ. 8,259 కోట్లు) డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 410 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ డ్యామ్‌ వచ్చే ఏడాది నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. థాయ్‌లాండ్‌కు 90 శాతం, స్థానికులకు 10 శాతం విద్యుత్‌ను సరాఫరా చేయాలనే ప్రధాన ఉద్దేశంతో దీన్ని నిర్మించతలపెట్టారు.

హైడ్రో ప్రాజెక్టుల ద్వారానే ఆదాయం
పలు నదులతో కూడిన లావోస్‌లో అధికార కమ్యూనిస్టు పార్టీ జల విద్యుదుత్పత్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వీటి ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను థాయ్‌లాండ్‌ వంటి ఇరుగుపొరుగు దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 ప్రాజెక్టులు నిర్వహణలో ఉండగా.. మరో 20 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో డజను ప్రాజెక్టులు ప్రణాళికా దశలో ఉన్నాయి. అయితే కిందటేడాది కూడా రాజధాని వియంటియానేకు ఉత్తరాన ఉన్న గ్జేసోంబూన్‌ ప్రావిన్స్‌లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కుప్పకూలిపోయి భారీ నష్టాన్ని మిగిల్చింది. 

మరిన్ని వార్తలు