సీఏఏ, ఎన్నార్సీ: భారత్‌కు హంగేరీ మద్దతు!

17 Jan, 2020 08:44 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం తగదని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్‌ సిజార్టో హితవు పలికారు. భారత ప్రభుత్వం అవలంబించే విధానాలను అనుసరించి ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో భారతీయులదే తుది నిర్ణయం అని వ్యాఖ్యానించారు. పీటర్‌ సిజార్టో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్నార్సీ), కశ్మీర్‌ తదితర అంశాలు భారత అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు తామెందుకు వాటి గురించి వ్యాఖ్యలు చేయాలని ప్రశ్నించారు. ‘‘అవన్నీ పూర్తిగా భారత అంతర్గత విషయాలు. వీటిని మేం భారతీయులకే వదిలేస్తాం. తమ దేశంలో సమర్థవంత పాలన అందించలేకపోయినా ఇతర దేశాలకు ఉద్భోద చేసే రకం కాదు మేము. నిజానికి ఒక ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వారినే తిరిగి ఎన్నుకుంటారు. లేనట్లయితే అధికారానికి దూరం చేస్తారు. కాబట్టి వీటన్నింటిపై స్పందించే హక్కు భారతీయులకే ఉంటుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా... కశ్మీర్‌కు రానున్న యూరోపియన్‌ యూనియన్‌ బృందంలో హంగేరీ ప్రతినిధి కూడా ఉంటారన్న ప్రశ్నకు బదులుగా... ‘‘ కశ్మీర్‌కు వెళ్తామని మేం ఎవరికీ చెప్పలేదు. భారత్‌తో ద్వైపాక్షిక బంధాలు మెరుగుపరచడానికే మా రాయబారి ఇక్కడ ఉన్నారు. ఇక కశ్మీర్‌ పర్యటన అందులో భాగం కాదు కదా’’ అని పీటర్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా చైనా సహాయంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించి.. దాయాది దేశం పాకిస్తాన్‌ భంగపడిన విషయం తెలిసిందే. ’‘ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌ ప్రతినిధులు పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ దేశం హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు


 

మరిన్ని వార్తలు