శాంతిస్తోన్న హరికేన్‌ మైఖేల్‌ 

12 Oct, 2018 02:45 IST|Sakshi

పనామా సిటీ: అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని హరికేన్‌ మైఖేల్‌ వణికించింది. గంటకు 155 మైళ్ల వేగంతో వీచిన గాలులు తీరప్రాంత వాసులను బెంబేలెత్తించాయి. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి విపత్తు సంభవించటం ఇదే తొలిసారని తెలిపారు. ప్రచండ గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు దెబ్బకు కూలిపోయాయి. తీరం దాటే సమయంలో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను వణికించింది. ఆ ప్రాంతంలో అనేక ఇళ్లు నీటి మునిగాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతానికి హరికేన్‌ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొంతమేర బలహీనపడి కేటగిరీ 4 నుంచి కేటగిరీ–1 తుపానుగా మారింది. అయినా దీని ప్రభావంతో ఇప్పటికీ 90 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. హరికేన్‌ తీరం దాటే సమయంలో వీచిన గాలులు మెక్సికో బీచ్‌ ప్రాంతంలో తీవ్ర బీభత్సం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. హరికేన్‌ కారణంగా తల్లాహసీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. 20 కౌంటీల్లోని సుమారు 3,75,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఎత్తున వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలోనే ఫ్లోరిడాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు