అమెరికాను భయపెట్టిన ‘నేట్’

9 Oct, 2017 11:24 IST|Sakshi

న్యూ ఆర్లియన్స్‌: అమెరికాను వణికించిన నేట్‌ హరికేన్‌ బలహీనపడి మిసిసిపి, అలబామా రాష్ట్రాల మధ్య ఆదివారం ఉదయం (భారత కాలమానం) రెండోసారి తీరాన్ని తాకింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా తీర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో అలలు కొనసాగుతాయని అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం హెచ్చరించింది. నేట్‌ హరికేన్‌ తీవ్రతను ఉష్ణమండల తుఫాను స్థాయికి తగ్గించినా హెచ్చరికల్ని మాత్రం కొనసాగిస్తున్నారు.

ఆదివారం సాయంత్రానికి మిసిసిపి రాష్ట్రంలోని మెరిడియన్‌ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన హరికేన్‌ ప్రభావంతో గంటకు 73 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. మిసిసిపి–అలబామా రాష్ట్రాల తీర ప్రాంతాలతో పాటు ఫ్లోరిడా రాష్ట్రంలోని వాల్టన్‌ కౌంటీలో భారీ అలలు ఎగసిపడవచ్చని, వరదలు సంభవించే ప్రమాదముందని, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో హరికేన్‌ ఇర్మా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని, కరీబియన్‌ దీవుల్లో కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది.

మరిన్ని వార్తలు