థాయ్‌లాండ్‌లో హైపోథెర్మియా వరుస మరణాలు

14 Nov, 2017 14:22 IST|Sakshi

బ్యాంకాక్‌ : థాయ్‌లాండ్‌లో ఇప్పుడు హైపోథెర్మియా పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆ స్థితి సంభవించిన సమయంలో మానవ శరీరం వేడిని త్వరగా బయటకు కోల్పోతుంది. శరీరంలో ఉష్టోగ్రతల తగ్గుదల మూలంగా ఏకంగా మనిషి ప్రాణాలే కోల్పోతాడు. ఇలా గత పదిహేను రోజుల్లో ఇలాంటి మరణాలు అక్కడ రెండు సంభవించాయి. 

మ్యూయాంగ్ జిల్లా ముక్దాన్‌ అనే పట్టణంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి తన ఇంట్లో ఇలాగే చనిపోయాడు. రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయం లేచేసరికి విగతజీవిగా మారిపోయాడు. ఇక అతని మరణానికి కారణం ఏంటంటే... ఆ ప్రాంతంలో పగటి పూట బాధించే తీవ్రమైన ఉష్ణోగ్రతలు రాత్రి పూట దారుణంగా పడిపోతుంటాయి. ఈ క్రమంలోనే చొక్కా లేకుండా అతను పడుకోవటంతోనే శరీరం చల్లబడిపోయి చనిపోయాడంట. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. 

ఇక పదిరోజుల క్రితం జరిగిన మరో ఘటనలో చయాఫూమ్‌ ప్రావిన్స్‌ కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్‌ ముయాంగ్‌ లోని తల్లి (86)ని చూసేందుకు వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే బసచేశాడు. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్రపోయాడు.  అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చల్లబడిపోవడానికి తోడు నేలపై పడుకోవడంతో అతని శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రజలు భయపడిపోతున్నారు. ఇక  హైపోథెర్మియా వల్ల 98.6 ఫారన్‌ హీట్‌ ఉండాల్సిన శరీర ఉష్ణోగ్రత..  95 ఫారన్‌ హీట్‌కు పడిపోతుంది. ఈ మరణాలకు మనిషి శారీరక దృఢత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండబోదని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు