అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!

29 Jul, 2016 15:34 IST|Sakshi
అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!

శ్రీనగర్ః భద్రతా బలగాలకు సజీవంగా చిక్కిన పాకిస్తానీ టెర్రరిస్ట్ బహదూర్ అలి.. తాను అమాయక పౌరుల్ని చంపేందుకే పాకిస్తాన్ నుంచీ కశ్మీర్ కు వచ్చినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు తెలిపాడు. కశ్మీర్ లో భద్రతా బలగాలు అరెస్టు తర్వాత..  అతనిని  విచారించిన ఎన్ఐఏ ముందు ఈ విచిత్ర ప్రకటన చేశాడు.  

శ్రీనగర్ లో భద్రతాబలగాలకు చిక్కిన ఉగ్రవాది బహదూర్ అలి ఎన్ఐఏ విచారణ సందర్భంలో అశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. బహదూర్ అలి.. అలియాస్ సైఫుల్లా తాను కశ్మీర్ కు సాధారణ, అమాయక ప్రజలను చంపేందుకే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిపాడు. అంతేకాదు తాను గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో (ఎల్ఈటీ) శిక్షణ పొందినట్లు చెప్పడంతోపాటు, జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను కూడా రెండుసార్లు కలిసినట్లు ఆ 22 ఏళ్ళ టెర్రరిస్ట్ ఎన్ఐఏకు తెలిపాడు. దీనికితోడు తాను పాక్ లో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ తో నిత్యం సంప్రదింపులు కూడా జరిపినట్లు చెప్పాడు. దీంతో బహదూర్ అలి లాహోర్ నగరానికి చెందిన పాకిస్తాన్ జాతీయుడని విచారణలో హోం మంత్రిత్వశాఖ నిర్థారించింది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి  హన్స్ రాజ్ అహిర్ కూడా అతడి గుర్తింపును ధ్రువీకరించారు.

కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో భద్రతాబలగాల కాల్పుల్లో మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి మాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. అతనివద్ద నుంచీ మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల కాలంలో సరిహద్దు జిల్లాల్లో పాకిస్తానీ టెర్రరిస్టును సజీవంగా పట్టుకోవడం ఇది రెండోసారి కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ ప్రాంతంనుంచీ తీవ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా టాంగ్ధర్ సెక్టర్ లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు.. అక్కడినుంచీ లీపా లోయలోకి వెళ్ళి అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన అడవీప్రాంతంలో దాక్కున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు