‘మాస్క్‌ మాటున నిశ్శబ్దంగా ఏడ్చా’

28 Apr, 2020 14:39 IST|Sakshi

న్యూయార్క్‌: ‘నా జీవితం, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ప్రమాదంలో ఉన్నట్లు నేను నిజంగా భావించాను. నేను అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా మాస్క్‌ మాటున ఏడ్చాను. ఎందుకంటే నేను ఎంతో ప్రమాదకరమైన స్థలంలో ఉన్నట్టు అనిపింది’.. ఎరిన్‌ స్ట్రెయిన్ అనే మహిళ అన్న మాటలివి. అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన ఆమె శనివారం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 338 విమానంలో న్యూయార్క్‌ సిటీ నుంచి షార్లెట్‌కు వచ్చారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ప్రయాణం తనకు భయానక అనుభవం కలిగించిందని ఆమె ‘డైలీ మెయిల్‌’కు వెల్లడించారు. (కరోనా వైరస్‌: మరో దుర్వార్త)

విమానం ప్రయాణికులతో కిక్కిరిసి ఉందని, ఎవరూ భౌతిక దూరం పాటించలేదని ఆమె వాపోయారు. కొంతమంది మాస్క్‌లు కూడా ధరించలేదని తెలిపారు. మిడిల్‌ సీటులో కూర్చున్న తనకు ఆరోగ్యం పట్ల ఆందోళన కలిగిందని చెప్పారు. ‘అసలు ఈ విమానం ఎందుకు ఎక్కానా అనిపించింది. నా చుట్టుపక్కల అంతా జనమే ఉన్నారు. ఎవరూ కూడా భౌతిక దూరం పాటించలేదు. తమకు తాముగా ఎవరూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎవరికైనా దగ్గు, తుమ్ము వస్తుందని తల తిప్పితే మనుషులు ఉన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని చూసి నాకు ఏడుపు వచ్చింది. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులకు హాని జరగకుండా మాస్క్‌ ధరించాలన్న కనీస విచక్షణ కూడా ప్రయాణికులకు లేకపోవడం బాధ కలిగించింద’ని ఎరిన్‌ స్ట్రెయిన్ పేర్కొన్నారు. విమానంలోని ఫొటోలు, వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీనిపై అమెరికన్‌ ఎయిర్‌టైన్‌ స్పందించింది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వైద్యాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సర్వీసులను నడుపుతున్నామని తెలిపింది. విమానంలో ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేస్తున్నామని.. తమ సిబ్బంది గ్లోవ్స్‌, మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. తనకు ఎదురైన భయానక అనుభవం నేపథ్యంలో తిరుగు ప్రయాణం టిక్కెట్‌ను రద్దు చేసుకుంటానని ఎరిక్‌ స్ట్రెయిన్ చెప్పారు. కాగా, అమెరికాలో కరోనా విజృంభణ న్యూయార్క్‌లోనే అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 3 లక్షలకు చేరువలో ఉండగా, 17,303 మరణాలు సంభవించాయి. ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే దాదాపు లక్షా 60 వేల కోవిడ్‌ కేసులు నమోదు కాగా, 12,287 మంది చనిపోయారు. 

కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు