‘నమస్తే ట్రంప్‌; నేను ఎగ్జయిట్‌ కాలేదు’

1 Mar, 2020 11:05 IST|Sakshi

దక్షిణ కరోలినా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన ప్రధాని అతడు. అతనో గొప్ప వ్యక్తి అని ట్రంప్‌ అభివర్ణించాడు. దక్షిణ కరోలినాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి తన భారత పర్యటనను గుర్తు చేశారు. లక్షకు పైగా జనంతో మొతెరాలో లభించిన అపూర్వ స్వాగతం మరువలేనిదని అన్నారు. తనకు భారీ జనబాహుళ్యంతో నిండిన సభల్లో పాల్గొనడం అంటే ఇష్టమని, అయితే, అమెరికాలో భారీ జన సమీకరణ జరగదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 
(చదవండి: ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!)

‘ప్రధాని మోదీతో భారత పర్యటన అద్భుతంగా సాగింది. దేశ ప్రజలు ప్రేమించే అతనో గొప్ప వ్యక్తి. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ అద్భుతం. భారీ సభల్లో మాట్లాడటం నాకు ఇష్టం. నా సభలకు జనం భారీగా వస్తారు. మొతెరా సభకు లక్షా యాభై వేల మంది జనం వచ్చారు. ప్రస్తుత కరోలినా సభకు జనం భారీగానే వచ్చారు. రెండు సభలూ నాకు ఇష్టమే. అయితే నేను ఈ సమూహాన్ని చూసి ఎగ్జయట్‌ కాలేదు. ఎందుకంటే నమస్తే ట్రంప్‌లో ఆ జన బాహుళ్యం, వారి ఆదరణ చూశాను కదా..! భారత్‌లో 150 కోట్ల జనాభా ఉంది. మనకేమో 35 కోట్ల జనాభానే. అమెరికాతో సంబంధాలు భారతీయులకు ఎంతో ఇష్టం. వారికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అదొక విలువైన పర్యటన’ అని అన్నారు.
(చదవండి : నమస్తే ట్రంప్‌ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!)

కాగా, గత సోమవారం సతీసమేతంగా భారత్‌లో పర్యటించిన ట్రంప్‌నకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని మొతెరాలో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో లక్షకు పైగా జనం పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమం, ఆగ్రాలోని ప్రపంచ సుందర కట్టడం తాజ్‌ మహల్‌ను ట్రంప్‌ దంపతులు, అతని బృందం సందర్శించింది. అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక చర్చల్లో మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి.

>
మరిన్ని వార్తలు