‘ఒబామాకేర్’పై ట్రంప్ యూటర్న్

13 Nov, 2016 02:39 IST|Sakshi
‘ఒబామాకేర్’పై ట్రంప్ యూటర్న్

చట్టాన్ని కొనసాగించనున్నట్లు సంకేతాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఒబామా హెల్త్‌కేర్ చట్టాన్ని కొన్ని మార్పులతో కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒబామా ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని రద్దు చేస్తానని ట్రంప్ చెప్పడం తెలిసిందే.  అరుుతే శ్వేతసౌధంలో గురువారం ఒబామాతో మట్లాడాక ట్రంప్ స్వరం మారినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ చట్టం రద్దును పునఃపరిశీలించాలని ట్రంప్‌తో భేటీలో ఒబామా కోరినట్టు పేర్కొంది. ‘ఒబామా కేర్ మార్పులతో కొనసాగించడమో రద్దు చేయడమే చేస్తాం. ఒబామాపై గౌరవంతో ఆయన సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని భేటీ తర్వాత ట్రంప్ అన్నారు. 

హామీల అమలుపై దృష్టి..
ట్రంప్ తన ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐసిస్‌ను ఓడించడంతో పాటు మెరుగైన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, భారీ మౌలిక పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల కల్పనపై చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ గెల్చిన వెంటనే ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మౌలిక అవసరాల ప్రాజెక్టుల ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను తొలగించడం కన్నా ఐసిస్‌ను ఓడించడంపైనే తమ దృష్టి ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ముగిసి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదర్చగలమని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ట్రంప్‌కు పదవీగండం: ప్రొఫెసర్ జోస్యం 
న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని అంచనా వేసి చెప్పిన ప్రొఫెసర్ అలన్ లిక్ట్‌మ్యాన్ మరో ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే త్వరలోనే ఆయనను రిపబ్లికన్ పార్టీ సదస్సు అభిశంసించి ఆయన స్థానంలో తమకు విశ్వాసపాత్రమైన, అదుపులో ఉండే నేతను ఎన్నకునే అవకాశం ఉందని అలన్ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న మైక్ పెన్‌‌స వంటి నేత వైపు రిపబ్లికన్ పార్టీ మొగ్గు చూపొచ్చని అలన్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్‌లో కథనం ప్రచురితమైంది.

ఆగని నిరసనలు
పోర్ట్‌ల్యాండ్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తగడంటూ చేపట్టిన నిరసనలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించారుు. పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ వీధులకెక్కారు. న్యూయార్క్‌లోని ట్రంప్ ఇంటి ఎదుట కూడా ఆందోళనలు జరిగాయి. తొలుత ఒరెగాన్, కాలిఫోర్నియా, ఫిలడల్ఫియా, లాస్ ఏంజెలిస్, ఫ్లోరిడాల్లో భారీగా జరిగిన నిరసనలు.. శుక్రవారం డెన్వర్,బాల్టిమోర్ తదితర  ప్రాంతాలకు విస్తరించారుు. పోర్ట్‌ల్యాండ్‌లో బేస్‌బాల్ బ్యాట్‌తో రోడ్డుపైకి వచ్చిన 4 వేలమందికి పైగా ఆందోళనకారులు కొన్ని హోటళ్లు, దుకాణాల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్‌తోపాటు పార్కింగ్ చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.

 

మరిన్ని వార్తలు