'చనిపోయేవరకు అమ్మకు నేనెవరో చెప్పలేదు'

9 Feb, 2016 16:07 IST|Sakshi
'చనిపోయేవరకు అమ్మకు నేనెవరో చెప్పలేదు'

లండన్: పసిప్రాయం నుంచే 'మీ అమ్మ చనిపోయింది' అని ఎవరైనా చెబుతుంటే.. అలా అస్సలు జరిగి ఉండకపోవచ్చనే అనుమానం నిత్యం వెంటాడుతుంటే.. మనసు ప్రతిక్షణం అమ్మకోసం వెతికేందుకు పరుగులు తీయిస్తుంటే.. లండన్లో పిలీస్ విజెల్ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొదట ఓ అనాథ బాలికగా తర్వాత, దత్త పుత్రికగా చిన్నతనంలోనే ఓ ఇంటికి వెళ్లిన ఆమెను తన తల్లి ఇంకా బ్రతికే ఉండొచ్చు.. అయితే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే ప్రశ్నలు వేధిస్తుండేవి. దీంతో, ఆమె మౌనంగా కనిపించినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా తన తల్లికోసం ఆరా తీసేది.

ఎట్టకేలకు తన తల్లిని గుర్తించేందుకు ఓ సుధీర్ఘ ప్రయాణం ప్రారంభించింది. తొలిసారి తాను ఏ అనాథ ఆశ్రమం నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లి తన తల్లి గురించి వెతికింది. దీంతో వారు ఆమె వివరాలు చెప్పారు. ఆమె పేరు బ్రిడ్జెట్ మేరి లాకిన్ అని, మద్యానికి అలవాటైన ఆమె ఓ దుర్వ్యసనపరురాలని, కొంత సమస్యాత్మక ప్రవర్తన కలిగిన స్త్రీ అని చెప్పారు. ఐర్లాండ్లో ఉంటున్న ఆమెను దుష్ఫ్రవర్తన కారణంగా సోదరుడు రోజూ కొట్టేవాడని, చివరికి ఆమె భరించలేక ఇళ్లు వదిలి బయటకు వచ్చిందని, ఆ తర్వాత ఐదుగురు వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకొని వారి ద్వారా ఐదుగురు సంతానం పొందిందని వివరించింది.

కానీ, ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా ఆమె బాగోగులు చూసుకోకుండా వదిలేశారని వారు చెప్పారు. అలా జన్మించిన వారిలో రెండో అమ్మాయివే నువ్వు(పిలీస్). అని, 1956లో పిలీస్ జన్మించిందని వివరాలు తెలిపారు. అయితే, పిలీస్ కేవలం ఎనిమిది నెలలు మాత్రమే తల్లి సంరక్షణలో ఉందని, నెలలపాప అని కూడా చూడకుండా పాపగా ఉన్నప్పుడు ఇంట్లో ఒంటరిగా వదిలేసి పబ్బుల్లో గడిపేందుకు వెళ్లేదని వివరించారు. చివరకు పిలీస్ సంరక్షణ తన వల్లకాదని తమ ఆశ్రమంలో చేర్చి వెళ్లిపోయిందని చెప్పారు.

అలా, అనాథ ఆశ్రమంలో పెరుగుతున్న పిలీస్ను ఓ కుటుంబం వచ్చి తమకు అప్పటికే ఉన్న కూతురుకి తోడుగా ఉంటుందని చెప్పి దత్త పుత్రికగా తీసుకెళ్లారని బాల్యం నుంచి దత్తత తీసుకెళ్లిన ఘట్టం వరకు ఆశ్రమ అధికారులు పిలీస్ కు వివరించారు. ఈ కథనం విన్న తర్వాత ఎలాగైనా తన తల్లిని కలుసుకోవాలని తాపత్రయపడింది. పోలీసులను ఆశ్రయించింది. ఆమె పేరు చెప్పగానే పోలీసులు శివమెత్తారు. ఆమె ఒక పనికిమాలిన స్త్రీ అని, తాగుబోతు, తిరుగుబోతు అని అనరాని మాటలు అన్నారు. బర్మింగామ్ లోని రెడ్ లైట్ ఏరియాలో ఉంటోందని చెప్పారు.

'ఓ కూతురుగా నువ్వు పడుతున్న ఆవేదన అర్ధం చేసుకోగలం కానీ, ఆమె వల్ల నీ జీవితమే సమస్యల సుడిగుండం అవుతుంది' అని పోలీసులు చెప్పారు. అయినా, వెనక్కి తగ్గని పిలీస్ అప్పటికే గర్భవతి కావడంతో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డను చంకన వేసుకొని భర్తతో కలిసి కార్లో వెళ్లి బర్మింగామ్ వీధులన్నీ గాలించింది. చివరకు ఓ ఇంట్లో తన తల్లి ఉందని గుర్తించింది. ఆమె కూతురిలా కాకుండా ఓ కొత్త వ్యక్తిలా ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టి ఎవరూ తీయకపోవడంతో తనే తెరుచుకోని లోపలికి వెళ్లింది. లోపల అంతా చీకటి.. ఓ మూలవైపుగా ఉన్న  మెట్లపైన కూర్చుంటు అక్కడ అసహాయ పరిస్థితుల మధ్యన ఉన్న తన తల్లిని చూసి పిలీస్ గుండె చెరువైంది.

తన తల్లి ఓ మోడువారిన చెట్టులా దర్శనమిచ్చింది. ఆమె ముఖం వాడిపోయి, జుట్టు రేగిపోయి, చర్మం పెలుసులు తేలి వేరేవరూ కూడా దగ్గరకు వచ్చేందుకు సాహసించని పరిస్థితుల మధ్య ఆమెను చూసింది. బాధను తనలోనే దిగమింగుకుని కుటుంబం కోసం, భవిష్యత్తుకోసం తనే ఆమె కూతురనే విషయాన్ని గొంతులో అదుముకొని తన తల్లితో సంభాషణ సాగించింది. తొలుత బ్రిడ్జెట్కు అసలు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంలో కొంత ఆందోళనగా అనిపించినా.. తనకు కూడా కాసేపు తోడు దొరికింది కదా అనుకుని తన గతాన్ని పిలీస్కు చెప్పింది. 'నాకు ఒక ముద్దుల కూతురు ఉండేది. కానీ, నేనే పోగొట్టుకున్నాను. ఓ అనాథ ఆశ్రమంలో వదిలివేశాను' అని చెప్పుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది బ్రిడ్జెట్.

ఈ మాటలు తలుచుకుంటూ 'ఆ సమయంలో ఆమెకు నా పుట్టిన రోజు తెలుసు.. కానీ, నేను ఆమె పక్కన కూర్చున్నా నేనెవరో ఆమెకు తెలియదు' అని పిలీస్ చెప్పింది. అలా ఎట్టకేలకు తన తల్లిని కలిసి పిలీస్ ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకోని అప్పుడే వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె.. తన తల్లికి ఓ నర్సులాగా తొమ్మిదేళ్లపాటు సేవలు చేసి మాతృరుణం తీర్చుకుంది. ఆమె చనిపోయాక అంత్యక్రియలు తానే స్వయంగా జరిపించింది. చనిపోయే చివరి క్షణంలో కూడా ఆమెకు తను ఎవరు అనే విషయం మాత్రం రహస్యంగానే ఉంచిపెట్టింది.

మరిన్ని వార్తలు