మూడు నెలలపాటు గ్యాంగ్‌ రేప్...

21 Dec, 2015 14:47 IST|Sakshi
మూడు నెలలపాటు గ్యాంగ్‌ రేప్...

వాషింగ్టన్: చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా యాజిది యువతులపై సామూహిక అత్యాచారాలు కొనసాగిస్తున్న ఐఎస్‌ఐఎస్ ముష్కర మూకల పైశాచికత్వ పరాకాష్టకు ప్రత్యక్ష బాధితురాలు ఆమె. అందమైన జీవితం గురించి కలలు కంటున్న వయస్సులో కన్యత్వాన్నే కాకుండా జీవితాన్నే చిదిమేసిన రాక్షస క్రీడకు ప్రత్యక్ష సాక్షి ఆమె. మూడు నెలల పాటు టెర్రరిస్టులు కబంధ హస్తాల్లో నలిగిపోయిన 21 ఏళ్ల నాదియా మురాద్ బాసీ తహా తనకు జరిగిన ఘోరాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా నేడు ప్రపంచానికి వివరించారు.

ఇరాక్‌లోని ఓ గ్రామంలో నివసిస్తున్న యాజిదీ కుటుంబానికి చెందిన నదియాను గతేడాది ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. ఆమెతో పాటు మరికొంత మంది మహిళలను, పిల్లలను ఆయుధాలు ఎక్కుపెట్టి కిడ్నాప్‌ చేసిన టెర్రరిస్టులు బస్సులో వారి ప్రాబల్యం ఎక్కువగావున్న మోసూల్ నగరానికి తీసుకెళ్లారు. అక్కడ తనకెదురైన అనుభవాన్ని నాదియా 15 దేశాల సభ్యత్వం గల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో తీవ్రంగా కదిలిపోతూ వెల్లడించింది. ఆమె చెప్పింది ఆమె మాటల్లోనే.....

'మేమంతా దాదాపు 150 మంది ఉన్నాం. బస్సులో వెళుతున్నప్పుడు కూడా వారు మమ్మల్ని వదిలి పెట్టలేదు. మమ్మల్ని తాకారు. అసభ్యంగా ప్రవర్తించారు. దిగాక ఓ భవనంలోకి తీసుకెళ్లారు.  అక్కడ వేలాది మంది యాజిదీ కుటుంబాల వారు ఉన్నారు. అందరిని వరుసగా నిలబెట్టి ఎవరికి కావాల్సిన వారిని ఎన్నుకొనే పద్ధతి అనుసరించారు. నేనైతే ఏం జరుగుతుందో తెలియని దశలో నిశ్చల విగ్రహంలా నిలిచుండిపోయాను. తలపైకైత్తి చూడగా, ఎదురుగా ఓ భారీ విగ్రహం నిలబడి ఉంది. అచ్చం రాక్షసుడిలానే ఉన్నాడు. భయమేసింది. ఏడుపాగలేదు. ఎంతో ఏడ్చాను. నేను చిన్న పిల్లను నన్ను వదిలేయండంటూ వేడుకున్నాను. ఆ రాక్షసుడు నన్ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. తన్నాడు. ఇంతలో అతను పోయి మరో వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. అతను కొంత చిన్నగా ఉన్నాడు.

ముందొచ్చిన రాక్షసుడు మళ్లీ ఎక్కడొస్తాడోనన్న భయంతో నన్ను తీసుకెళ్లాల్సిందిగా అతన్ని వేడుకున్నాను. మతం మార్చుకుంటావా, పెళ్లి చేసుకుంటానని చె ప్పాడు. మతం మార్చుకోవడానికి నేను ఇష్టపడలేదు. నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. బట్టలిప్పాల్సిందంటూ కొట్టాడు. అతనితోపాటు మరికొంత మంది టెర్రరిస్టులు వరుసగా నన్ను రేప్ చేశారు. నేను స్పృహతప్పి పోయేవరకు వదిలి పెట్టలేదు. అలా మూడు నెలలపాటు వారి కబంధ హస్తాల్లో నరకం చూశాను.  ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న ఐఎస్‌ఐస్ టెర్రరిస్టులు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని, ఈ ప్రపంచ దేశాలను వేడుకొంటున్నాను'  అంటూ నాదియా గద్గద స్వరంతో చెప్పింది.

 

మూడు నెలల అనంతరం టెర్రరిస్టుల చెర నుంచి ఎలాగో బయటపడిన నాదియా స్వచ్ఛంద సంస్థల సాయంతో జర్మనీ చేరుకుంది. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. ఆమె గాథ విన్న 15 దేశాల ప్రతినిధులు చలించిపోయారు. తన అనుభవాన్ని ప్రపంచానికి వెల్లడించిన ఆమె మనోధైర్యాన్ని ప్రశంసించారు. ఇది కచ్చితంగా మానవ హననంలాంటి దారుణమేనని వారు అభిప్రాయపడ్డారు. యుద్ధ నేరాల కింద ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను శిక్షించాల్సిందేనన్నారు.

మరిన్ని వార్తలు