వుహాన్‌కు భారత్‌ మందులు

27 Feb, 2020 04:03 IST|Sakshi

15 టన్నుల మందులతో బయల్దేరిన విమానం

న్యూఢిల్లీ/సియోల్‌/బీజింగ్‌: కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్‌ ప్రాంతానికి భారత్‌ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన విమానంలో బుధవారం ఈ మందులను తరలించారు.  వుహాన్‌కు వెళ్లేందుకు భారత్‌కు చెందిన విమానాలకు అనుమతులివ్వడంలో చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని గత వారం భారత్‌ ప్రకటించడం తెల్సిందే. విమానం తిరిగొస్తూ 80 మంది భారతీయులు, చుట్టుపక్కల దేశాల నుంచి 40 మందిని భారత్‌కు తీసుకురానుంది. విమానంలో మాస్కులు, గ్లోవ్స్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు తెలిపింది.

ద.కొరియాలో కోవిడ్‌ పైపైకి
చైనాలో కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే మరోవైపు దక్షిణ కొరియాలో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే 134 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. చైనాలో కోవిడ్‌ తీవ్రత క్రమేపీ తగ్గుతోంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మంగళవారం 52 మంది వైరస్‌సోకి మరణించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 2715కు చేరుకోగా, వ్యాధితో ఉన్న వారి సంఖ్య 78,064కు చేరింది.

>
మరిన్ని వార్తలు