అమెరికా ఎన్నికల్లో మనోళ్ల హవా

10 Nov, 2016 11:48 IST|Sakshi
అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా.. ఆరుగురు భారత సంతతివారు ఎన్నికయ్యారు. విజేతలకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అభినందనలు తెలిపారు. రాజా కృష్ణమూర్తి, పరిమళా జయపాల్, రో ఖన్నా, అమి బెరా, తులసీ గబ్బర్డ్, కమలా హ్యారిస్ ఈసారి ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయాలలో ఉన్న భారత సంతతి అమెరికన్లు రెండు దేశౄల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఐఏఎఫ్‌సీ వారితో కలిసి కృషిచేస్తుంది. పార్టీలతో సంబంధం లేకుండా భారతీయ అమెరికన్లు ఎన్నికల్లో గెలిచేందుకు కూడా కృషిచేస్తుంది. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
రాజా కృష్ణమూర్తి (43) : ఢిల్లీలో పుట్టిన ఈయన.. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీతో పాటు హార్వర్డ్ లా స్కూల్లో చదివారు. శివానందన్ ల్యాబొరేటరీస్, ఎపిసోలార్ ఇన్‌కార్పొరేటెడ్ సంస్థలకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇల్లినాయిస్ ఎనిమిదో కాంగ్రెషనల్ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు ఈయన ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేసిన ఈయనకు 58 శాతం మెజారిటీ వచ్చింది. 
 
పరిమళా జయపాల్ (51) : చెన్నైలో పుట్టిన ఈయన.. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో చదివారు. ఫైనాన్షియల్ అనలిస్టు అయిన ఈయన.. వాషింగ్టన్ ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీచేసి తొలిసారి గెలిచారు. ఈయనకు తన రిపబ్లికన్ ప్రత్యర్థిపై 57 శాతం మెజారిటీ వచ్చింది. 
 



రో ఖన్నా (40) : ఫిలడెల్ఫియాలో పుట్టిన ఈయన.. యేల్ లా స్కూలు నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయన ఖన్నా, కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున 60 శాతం మెజారిటీతో నెగ్గారు. 
 
 
డాక్టర్ అమి బెరా (61) : లాస్ ఏంజెలిస్‌లో పుట్టిన బెరా కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన కాలిఫోర్నియా ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుంచి పోటీ చేసి, మూడోసారి డెమొక్రాటిక్ అభ్యర్థిగా 51 శాతం మెజారిటీతో నెగ్గారు. 
 


తులసీ గబ్బర్డ్ (35) : అమెరికాలోని లెలోవాలోవాలో పుట్టిన ఈమె.. హవాయి పసిఫిక్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు. తులసికి భారతీయ మూలాలు లేకపోయినా.. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి హిందువు ఈమె. 
 




కమలా హ్యారిస్ (52) : కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో పుట్టిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పట్టభద్రురాలయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ అయిన ఈమె.. కాలిఫోర్నియా సెనేటర్‌గా తొలిసారి పోటీచేసి 63 శాతం మెజారిటీతో నెగ్గారు. ఈమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ భారతీయురాలు. ఆమె రొమ్ము కేన్సర్ నిపుణురాలు. తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ పౌరుడు. ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్
మరిన్ని వార్తలు