సంబంధాలు పునర్నిర్మించుకుందాం!

18 Nov, 2018 04:22 IST|Sakshi
సోలిని అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతో ముచ్చటిస్తున్న మోదీ

మాల్దీవుల అభివృద్ధికి భారత్‌ తన వంతు సాయం

ఆ దేశ కొత్త అధ్యక్షుడు సోలితో మోదీ భేటీ

ప్రమాణ స్వీకారానికి హాజరు

మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలితో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్ని పునర్నిర్మించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శనివారం సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ వెంటనే ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు.

మాల్దీవుల్లో అధికార మార్పిడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల్ని సోలి మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గృహ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగు నీరు, మురుగు నీటి నిర్వహణ తదితర సౌకర్యాల్ని వెంటనే మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు.  పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ హయాంలో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్‌.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్‌ వ్యతిరేకించింది.

విమానాశ్రయంలో ఘన స్వాగతం..
అంతకుముందు, మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభించింది. సోలి ప్రమాణస్వీకారం సందర్భంగా మాల్దీవుల మాజీ అధ్యక్షులు అబ్దుల్‌ గయూమ్, మహ్మద్‌ నషీద్‌ల మధ్య కూర్చున్న మోదీ..వారిని హత్తుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతోనూ ముచ్చటించారు. సోలి ప్రమాణానికి హాజరైన అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత మోదీనే కావడం గమనార్హం. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.
 

మరిన్ని వార్తలు