కేప్‌టౌన్‌కు ఐస్‌బర్గ్స్‌ ఉపశమనం..!!

1 May, 2018 09:09 IST|Sakshi
అంటార్కిటికా ఖండంలోని ఓ ప్రాంతం

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్‌ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్‌టౌన్‌ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే.

మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్‌టౌన్‌లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది.

అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్‌టౌన్‌కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్‌బర్గ్‌ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్‌ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు