పాక్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీజే

20 Feb, 2019 07:00 IST|Sakshi

ద హేగ్‌: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలన్న పాకిస్తాన్‌ వాదనను ద హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి పాకిస్తాన్‌ తరఫున తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన తస్సాదుక్‌ హుస్సేన్‌ జిలానీని పాక్‌ నియమించుకోగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తాము మరో తాత్కాలిక జడ్జిని నియమించుకుంటామనీ, ఆయన ఈ కేసు గురించి అధ్యయనం చేసేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ పాకిస్తాన్‌ అభ్యర్థించగా ఐసీజే తిరస్కరించి కేసు విచారణను కొనసాగించింది. పాక్‌ తన వాదన వినిపిస్తూ ఈ కేసుతో భారత్‌ ఐసీజేనే ‘రాజకీయ థియేటర్‌’గా మార్చేసిందనీ, కేసును కొట్టేయాలని కోరింది. జాధవ్‌ గూఢచారేననీ, పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు చేయడానికే తమ దేశానికి వచ్చాడని ఆరోపించింది. నాలుగు రోజులపాటు సాగే జాధవ్‌ కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభం కావడం తెలిసిందే.  

మరిన్ని వార్తలు