‘చచ్చినా అతన్ని వదలొద్దు.. శవాన్ని అయినా ఉరి తీయండి’

19 Dec, 2019 19:46 IST|Sakshi

కరాచి : రాజద్రోహం కేసులో ఉరిశిక్ష పడిన మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌పై పాకిస్తాన్‌ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజద్రోహం కేసు తీర్పు వివరాలను ముగ్గురు సభ్యుల బెంచ్‌ గురువారం సమగ్రంగా చదివి వినిపించింది. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్‌ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో మూడు రోజులపాటు వేలాడదీయాలని పేర్కొంది. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్‌కి పారిపోయిన ముషారఫ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. 
(చదవండి : ముషారఫ్‌కు మరణశిక్ష)

రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్‌ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వకార్‌​ అహ్మద్‌ సేథ్‌ నేతృత్వం వహించగా జస్టిస్‌ కరీం, జస్టిస్‌ నజారుల్లా అక్బర్‌ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్‌ వకార్‌​ అహ్మద్‌,  జస్టిస్‌ కరీం ముషారఫ్‌ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్‌ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు. 
(చదవండి : ముషారఫ్‌కు పాక్‌ ప్రభుత్వం మద్దతు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు