'నా కొడుకైనా సరే కాల్చిపారేయండి'

21 Sep, 2017 13:48 IST|Sakshi
'నా కొడుకైనా సరే కాల్చిపారేయండి'

మనీలా: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ఆయన మాటలను బట్టి చెప్పవచ్చు. దేశంలో పేరుకుపోయిన డ్రగ్‌ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న డ్యుటర్టె.. తన కుమారుడు పాలో డ్యుటర్టెపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడ్డాడని నిరూపితమైతే తన కుమారుడినైనా కాల్చిపారేయాల్సిందేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రాకెట్‌ నిర్వహిస్తున్నాడంటూ అధ్యక్షుడి కుమారుడు పాలో డ్యుటర్టెపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

గతంలోనే డ్రగ్స్ రాకెట్‌లో పాలోపై ఆరోపణలు ఉండటంతో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా డీలర్లతో కలిసి పాలో డ్యుటర్టె దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు రొడ్రిగో ఈ విధంగా స్పందించారు. 'డ్రగ్స్ మాఫియాలో మా కుటుంబానికి సంబంధమే లేదు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటాను. నా కుమారుడు పాలో డ్రగ్స్ రాకెట్‌లో భాగస్వామి అని నిరూపించినట్లయితే అతడిని కాల్చిపారేయమని ఆదేశిస్తాను. పాలోను చంపిన వారికి రక్షణ కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ' అధ్యక్షుడు రొడ్రిగో వివరించారు.

గతేడాది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రగ్స్ రాకెట్‌పై సీరియస్‌గా ఉన్న రొడ్రిగో ఆదేశాలతో 3800 మందిని పోలీసులు కాల్చి చంపారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారితో పాటు వీటిని అక్రమరవాణా చేస్తున్న వారిపై రొడ్రిగో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మీరు ఉగ్రవాదులను చంపితే ఎలాంటి భయం అక్కర్లేదు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి వాస్తవం చెప్పండంటూ మరోసారి దేశ ప్రజలకు భరోసా ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు