'సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాక్‌కు'

19 Feb, 2018 20:31 IST|Sakshi

వాషింగ్టన్: గతంలో సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాకిస్తాన్‌కు పడుతుందని ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ పేర్కొన్నారు. ఆయుధాల కోసం పోరు కొనసాగిస్తే గతంలో సోవియట్ యూనియన్ కొన్ని రాజ్యాలుగా విడిపోయినట్లు పాక్ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని హెచ్చరించారు. అమెరికాలోని ఫ్లొరిడా వర్సిటీ విద్యార్థులతో సమావేశం సందర్భంగా పాక్ తీరుపై తీవ్ర అసహనాన్ని వెల్లగక్కారు హక్కానీ.

గతంలో అమెరికాలో పాక్ దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన హక్కానీ.. ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఆర్థిక శక్తి కావాలన్నారు. కానీ పాక్ అణ్వాయుధాలు, అణ్వస్త్ర సామాగ్రి.. ఉగ్రవాదం అంశాలపై దృష్టిపెట్టిందన్నారు. అణ్వస్త్ర సామర్థ్యంతో అగ్రరాజ్యాల సరసన తమ పేరు చేరుతుందని, వారితో సమానంగా తమకు గౌరవం, హోదా లభిస్తుందని పాక్ ఆలోచిస్తుందని తెలిపారు. 

12-14 శతాబ్దాల్లో పరిపాలన కొనసాగినట్లు పాక్‌లో వ్యవహారం నడుస్తోందని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఆర్థికంగా శక్తిమంతమైన దేశంగా ఎదగడంతో పాటు ఆర్మీపై ఖర్చుచేసే నిధులను సామాన్య ప్రజలకు వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు హక్కానీ. ఆయన ప్రస్తుతం హడ్సన్ ఇనిస్టిస్ట్యూట్‌లో దక్షిణ, మధ్య ఆసియాలకు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

       

 

మరిన్ని వార్తలు