హౌజ్‌లో.. 181 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

5 Jan, 2019 13:30 IST|Sakshi
ఇల్హాన్‌ ఒమర్‌

వాషింగ్టన్‌ : కొత్తగా కొలువుదీరిన ప్రతినిధుల సభ(హౌజ్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్‌, టర్బైన్‌) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్‌ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం.

‘హెడ్‌గేర్‌ ధరించడంపై 181 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని 116వ కాంగ్రెస్‌ సభ్యులు ఎత్తివేశారు. నాకు ఇంతటి సాదర స్వాగతం పలికిన నా సహచరులకు ధన్యవాదాలు. ఈవిధంగానే.. ముస్లిం కుటుంబాలను అమెరికా నుంచి విడదీసే నిషేధానికి కూడా ముగింపు పలికే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఇల్హాన్‌ ఒమర్‌ ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కాగా నవంబరులో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభ(హౌజ్‌)కు ఎన్నికయ్యారు. ఇందులో 28 మంది తొలిసారిగా ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. వీరంతా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇక ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబా, సోమాలియాకు చెందిన ఇల్హాన్‌ ఒమర్‌లు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు