కోర్టులో టేబులెక్కిన బాలుడు.. అయోమయంలో జడ్జి!

7 Jul, 2018 15:33 IST|Sakshi

అమెరికా కోర్టుల్లో వలస పిల్లల పాట్లు

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన పిల్లలు ఇమిగ్రేషన్‌ కోర్టు ముందుపడరాని పాట్లు పడుతున్నారు. వారిలో మూడేళ్ల పిల్లలు కూడా ఉంటున్నారు. వారి తరఫున వాదించేందుకు న్యాయవాదులనుగానీ, అమెరికా ఆంగ్లభాషను వారి మాతృభాషలోకి తర్జుమా చేసి చెప్పేందుకు దుబాషీలనుగానీ కోర్టులు నియమించడం లేదు. అందుకు అమెరికా చట్టమే అనుమతించడం లేదు (అయితే సొంతంగా వారిని ఏర్పాటు చేసుకోవచ్చు). పర్యవసానంగా కోర్టుకొచ్చిన పిల్లలు బిక్క మొహాలేసుకొని జడ్జీ వైపు, న్యాయవాదుల వైపు తేరపార చూస్తుంటారు. లేకపోతే చూరుకేసే, బల్లకేసో చూస్తుండి పోతారు. ఇలాగే ఇటీవల కోర్టుకు విచారణకు వచ్చిన ఓ మూడేళ్ల బాలుడు కోర్టులో జరుగుతున్న తంతేమిటో పట్టించుకోకుండా  తన చెవులకు తగిలించిన హెడ్‌ఫోన్‌ను పక్కన పడేసి ఎంచక్కా ముందున్న టేబులెక్కి కూర్చున్నాడు. ఇమిగ్రేషన్‌ జడ్జీ ఏం చేయాలో తెలియక విచారణ ముగిసినట్లు ప్రకటించారు.

తమ తరఫున వాదించేందుకు న్యాయవాది, దుబాషీ లేకుండా విచారణకు హాజరయ్యే ప్రతి పది మంది పిల్లల్లో తొమ్మిది మంది పిల్లలను వారి వారి దేశాలకు వెనక్కి పంపిస్తున్నారు. అదే న్యాయవాది సహకారంతో విచారణకు వస్తున్న పిల్లల్లో సగం మందికి అమెరికాలోనే ఉండిపోయే అవకాశం లభిస్తోంది.

న్యాయవాదులను పెట్టుకునే అవకాశంలేని పిల్లల తరఫున వాదించేందుకు ఇప్పుడు ‘ఇమ్మిగ్రేషన్‌ కౌన్సెలింగ్‌ సర్వీస్‌’కు చెందిన లిండా ఫ్రీడ్మన్‌ ముందుకొచ్చారు. గతంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా వలసవచ్చిన పిల్లలను తల్లిదండ్రులతో కలిపే విచారించే వారని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానం కింద పెద్ద వాళ్లను, పిల్లలను వేరుచేసి కోర్టు ముందు విచారిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ మధ్య పెద్ద వాళ్లు లేకుండా పిల్లలు వలస రావడం కూడా ఎక్కువైందని ఆమె చెప్పారు. అంటే, తల్లిదండ్రులే పిల్లలను తీసుకొచ్చి సరిహద్దులు దాటించి వెనక్కి వెళ్లిపోతారని ఆమె వివరించారు.
 

ఇమ్మిగ్రేషన్‌ కోర్టు ముందు పిల్లల విచారణ పేరిట జరుగుతున్న తంతు చూసి స్పందించిన లిండా ఫ్రీడ్మన్‌ వారికి న్యాయ సహాయం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఈ పరిస్థితి ప్రపంచం దష్టికి తీసుకురావడం కోసం ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీసి విడుదల చేశారు. ఆమె తన చిన్ని సినిమా కోసం కోర్టులో నిజంగా జరిగిన మాటల స్క్రిప్టును యథాతథంగా తీసుకున్నారు. అయితే విచారణ ఎదుర్కొంటున్న బాలుడు, కోర్టును అపహాస్యం చేస్తున్నట్లు ఎదురుగా ఉన్న టేబుల్‌ను ఎక్కిన దశ్యం మాత్రం ఆ చిన్ని సినిమాలో లేదు. సినిమాను విడుదల చేశాక ఆ బాలుడి సంఘటన చోటుచేసుకున్నదని లిండా తెలిపారు. ‘అన్‌అకంపేన్డ్‌: ఎలోన్‌ ఇన్‌ అమెరికా’ పేరుతో ‘యూట్యూబ్‌’లో విడుదలైన ఈ చిన్ని సినిమాను దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఇప్పటికే చూశారు.

మరిన్ని వార్తలు