ఇప్పట్లో కోలుకోలేం: ఐఎల్‌ఓ

1 Jul, 2020 10:04 IST|Sakshi

జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) మంగళవారం పేర్కొంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం ప్రపంచ కార్మిక మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి తప్పదని తాజా నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల స్థాయిని వైరస్‌ వ్యాప్తికి ముందు ఉన్న స్థితికి ఈ సంవత్సరంలో తీసుకు రాలేమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల పని గంటలు, వేతనాలు తగ్గుతాయని ఐఎల్‌ఓ హెచ్చరించింది.(లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులు)

కరోనా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చడంతో కార్మిక మార్కెట్లకు జరిగిన నష్టం అంచనాలను గతం కంటే గణనీయంగా పెంచామని ప్రపంచ కార్మిక సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో కోలుకోలేమన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయన్నారు. ఇప్పటికీ 93 శాతం మంది కార్మికులు పని ప్రదేశాలు మూసివేసిన దేశాల్లోనే నివసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం మహిళా కార్మికులపై అధికంగా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, ఆర్థిక సంక్షోభం.. ఇది ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. వైరస్ నేపథ్యంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచం కూడా సిద్ధంగా ఉండాలని, ఈ పరిస్థితులను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐఎల్‌ఓ పేర్కొంది. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్‌)

ప్రపంచ పని గంటలు తగ్గడంతో గతంలో అంచనా వేసిన దానికంటే ఈ సంవత్సరం మొదటి భాగంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐఎల్‌ఓ తన తాజా నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం ప్రభావం
అమెరికాపై అత్యధికంగా ఉందని, అగ్రరాజ్యం దాదాపు 18.3 శాతం​ పని గంటలను కోల్పోయిందని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో 14 శాతం పని గంటలు వృధా అయ్యాయని, ఇది 40 కోట్ల ఫుల్‌ టైం ఉద్యోగాలకు సమానమని అంచనా వేసినట్లు ఐఎల్‌ఓ తెలిపింది. ఈ నష్టాలు నాల్గవ త్రైమాసికంలోనూ కొనసాగి దాదాపు 14 కోట్ల ఫుల్‌ టైం ఉద్యోగాలకు సమానమైన 4.9 శాతం పని గంటలు కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది. మహమ్మారి రెండో దశగా పరిగణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఖ్య 11.9 శాతం లేదా 340 మిలియన్ ఉద్యోగాలకు పెరగవచ్చని తెలిపింది. (కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక)

>
మరిన్ని వార్తలు