మిషెల్‌ ప్రసంగం స్ఫూర్తితో..

10 Mar, 2017 01:22 IST|Sakshi

►  సేవా రంగం వైపు  భారతీయ యువతి సింధూ
► ఒబామాకు లేఖ


వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది.

నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్‌ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు.

మరిన్ని వార్తలు