ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని ఊపేసిన ఫొటోలివే!

29 Dec, 2015 01:59 IST|Sakshi

2015 సంవత్సరంలో నెటిజన్లకు ఆన్‌లైన్ ప్రపంచం ఎన్నో ఊసులు పంచింది. ఎన్నో విషయాలు పంచుకుంది. లైకులు, కామెంట్లు, షేరింగులు ఇలా సాగే ఆన్‌లైన్‌ లోకంలో ఎన్నో ఫొటోలు వైరల్‌లా వ్యాప్తి చెందాయి. కొన్ని కదిలించాయి. మరికొన్ని చర్చలు రేకెత్తించాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన ఫొటోలు.. ఆ వివరాలు

 

ద డ్రెస్‌!
'ద డ్రెస్‌' పేరిట ఈ ఏడాది ఫిబ్రవరిలో పోస్టు అయిన ఈ ఫొటో పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేసింది. 21 ఏళ్ల యువగాయని కైట్లిన్ మెక్‌నీల్‌ ఈ ఫొటోను మొదట సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ టంబ్లర్‌లో పోస్టు చేసింది. ఉతికిన తర్వాత తన డ్రెస్‌ను ఫొటో తీసి.. ఇది ఏ రంగులో ఉంది నీలి-నలుపు రంగుల్లోనా? లేక తెలుపు-బంగారు రంగులోనా? అంటూ ఆమె ప్రశ్నించింది. ఇది తీవ్రమైన చర్చకు దారితీసి.. మహిళల దుస్తులు, వారి డ్రెస్సింగ్ అంశాలపై విపరీతంగా పోస్టులు, ట్వీట్‌లు వెల్లువెత్తాయి.

కెమెరాను చూసి గన్‌ అనుకొని..!
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలోని చిన్నారుల దుస్థితికి నిదర్శనం ఈ ఫొటో. ఓ ఫొటోగ్రాఫర్‌ చిన్నారి ఫొటో తీస్తుండగా.. దానిని తుపాకీగా భ్రమించిన ఆ పాప కళ్లనీళ్లు పెట్టుకుంటూ చేతులు పైకిఎత్తడం అక్కడి హృదయవిదారకమైన పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటోను జర్నలిస్టు నదియా అబుషబాన్‌ మొదట ట్వీట్‌ చేశారు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలించింది.

పిల్లి మెట్లు ఎక్కుతుందా? దిగుతుందా?
ఈ ఫొటోను చూసిన ప్రతి ఒక్కరికీ కలిగిన అనుమానం ఇదే. ఫొటోను నిశితంగా పరిశీలించి చూసి కూడా చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు పిల్లి మెట్లు వెనుకగా దిగుతుందని అంటే మరికొందరు కాదు పిల్లి మెట్లు ఎక్కుతుందని ఆన్‌లైన్‌లో చర్చోపచర్చలు చేశారు. దీంతో 'ద డ్రెస్‌' హాష్‌ట్యాగ్‌ లాగే ఈ మార్జాలం చిత్రం కూడా హల్‌చల్ చేసింది.

కాల్‌ మి కైట్లిన్‌!
అమెరికా ఒలింపియన్ చాంపియన్‌ అయిన బ్రూస్‌ జెన్నర్‌ తాను ట్రాన్‌ జెండర్‌ అంటూ ప్రపంచానికి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తనను అందరూ కైట్లిన్‌ బ్రూస్‌గా పిలువాలంటూ తన కొత్త పేరును తెలిపాడు. వ్యానిటీ ఫెయిర్‌ ముఖచిత్రంలో హాట్‌హాట్‌గా పోజులిచ్చి.. ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది/డు కైట్లిన్‌. ట్విట్టర్‌లో అతి తక్కువకాలంలో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న  వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రికార్డును తను అధిగమించింది.

కేఎఫ్‌సీలో ఎలుక నిజమేనా?
ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఎలుక ఇది. ప్రముఖ కేఎఫ్‌సీ దుకాణంలో కొనుగోలు చేసిన ఆహారంలో ఈ ఎలుక వచ్చిందంటూ గత జూన్‌లో ఫేస్‌బుక్‌లో పోస్టయింది. పోస్టయిన వెంటనే వైరల్‌గా మారింది. ఇది బూటకపు ఫొటో అని కేఎఫ్‌సీ తర్వాత ప్రకటించినా.. అప్పటికే అది ప్రపంచమంతా చుట్టేసింది.

మిణుకుమిణుకుమనే వెలుగులో..!
రాత్రి అయింది. చుట్టూ నిర్మానుష్యం. దూరంగా మెక్‌డొనాల్డ్‌ దుకాణానికి ఉన్న బోర్డు లైట్‌ స్వల్పంగా కాంతి వెదజల్లుతోంది. ఆ కాంతిలో ఇదిగో ఇలా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ చిన్నారి చదుకుంటున్న ఫొటో ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. గత జూలైలో ఈ ఫోట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

వెంటాడుతున్న దృశ్యం!
మూడేళ్ల పసిబాలుడు అయ్‌లార్‌ కుర్దీ విగతజీవుడై ఇదిగో ఇలా టర్కీ తీరానికి కొట్టుకొచ్చాడు. యుద్ధ కల్లోల సిరియా నుంచి శరణార్థిగా తండ్రి వెంట పశ్చిమ దేశాలకు వలసపోతూ.. మార్గమధ్యంలో తమ పడవ మునిగిపోవడంతో ఆ చిన్నారి ఇలా కెరటాలతోపాటు నిర్జీవంగా తీరానికి కొట్టుకొచ్చాడు. ఈ ఫొటో నెటిజన్ల గుండెల్ని పిండేసింది. మధ్యప్రాచ్యంలోని వలస విషాద దృశ్యానికి అయ్‌లాన్‌ కుర్దీ ఫొటో ప్రతక్ష నిదర్శనంగా నిలిచిపోయింది.

శరణార్థిని తానే పడేసి..
శరణార్థులపట్ల ఓ హంగేరియన్ లేడీ కెమెరామాన్ చేసిన దుస్సాహసం ఇది. సెర్బియా సరిహద్దు గుండా హంగేరిలో అడుగుపెడుతున్న ఓ శరణార్థి పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండగా ఓ హంగేరి ఫొటో గ్రాఫర్ ఇలా కాలు అడ్డంపెట్టి అతడిని పడేసింది. దీనిపై పలువురు పెదవివిరిచారు. ఈ ఘటన ఆ లేడీ ఫొటోగ్రాఫర్ ఉద్యోగానికే ఎసరు పెట్టింది కూడా.

రాదేమాలో రెండో కోణమిది
వివాదాస్పద ఆద్మాత్మిక గురువు రాదేమాలో రెండు కోణాలు ఉన్నాయని చెప్పేందుకు ఈ ఫొటో ఓ సజీవ సాక్ష్యం. ఇంటర్నెట్లో ఈ ఫొటో చేసిన సంచలనం అంతా ఇంతాకాదు. ఓపక్క నిండైన వస్త్రాలు, దైవమాలలు మెడలో ధరించి నలుగురిని దీవించే దైవమాతగా కనిపిస్తుండగా మరో ఫొటోలో అసభ్యకరంగా స్కర్ట్ వేసుకొని చక్కగా హిందీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు కూడా వేసి వివాస్పదంగా నిలిచింది.

మోదీ దగ్గరగా చూసినట్లే...
ఈ ఫొటో చెన్నై వరదల సమయంలోనిది. చెన్నై వరదల్లో చిక్కుకున్నప్పుడు భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడ ఏరియల్ సర్వే నిర్శహించారు. కానీ, ఆ సమయంలో నీట మునిగిన ప్రాంతాలు అతి సమీపం నుంచి మోదీ చూసినట్లుగా మభ్యపెడుతూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఈ ఫొటో మార్పింగ్ చేసి పబ్లిష్ చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగగా, పీఐబీ అందరికీ క్షమాపణలు తెలిపింది.  
 

మరిన్ని వార్తలు