‘అందుకే మాకు ఏ దేశం మద్దతివ్వడం లేదు’

25 Sep, 2019 12:26 IST|Sakshi

న్యూయార్క్‌: జమ్మూకశ్మీర్‌ అంశంలో ఏ దేశం కూడా పాక్‌కు మద్దతు ఇవ్వడం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మీడియా ముందు వాపోయారు. కశ్మీర్‌ అంశంలో ప్రపంచదేశాల తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని.. ఏ దేశం కూడా మోదీ మీద ఒత్తిడి తీసుకురావడం లేదని ఇమ్రాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిమిత్తం భారత్‌, పాక్‌ ప్రధానులిద్దరు న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇమ్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ అంశంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి మేం చేసిన ప్రయత్నాలు అన్ని వృథా అయ్యాయి. 100 కోట్ల జనాభా ఉన్న భారత్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఏ దేశం మాకు మద్దతివ్వడం లేదు.. మోదీని వ్యతిరేకించడం లేదు. కశ్మీర్‌ అంశంలో యుద్ధం మినహా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం’ అని తెలిపారు. ప్రపంచ దేశాల మద్దతు ఉన్నా లేకపోయినా తాము మాత్రం మోదీపై ఒత్తిడి తేస్తూనే ఉంటామని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలను పాక్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌ అంశంలో భారత్‌ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టేందుకు పాక్‌ చేయని ప్రయత్నం లేదు. కానీ అవన్ని బెడిసికొట్టాయి. పాక్‌కు మద్దతు కొరవడటమే కాక ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా పరిష్కరించుకోమని సూచించాయి. కానీ ట్రంప్‌ మాత్రం ఇరు దేశాల ప్రధానులు అంగీకరిస్తే.. జమ్మూకశ్మీర్‌ అంశంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
(చదవండి: వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు