కశ్మీర్‌పై మళ్లీ చెలరేగిన ఇమ్రాన్‌

11 Aug, 2019 16:00 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్తాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై బౌన్సర్ల ధాటి కొనసాగిస్తూనే ఉన్నారు. కశ్మీర్‌ భౌగోళిక స్వరూపాన్ని మార్చే క్రమంలోనే భారత్‌ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఆరెస్సెస్‌ను నాజీతో పోల్చిన ఇమ్రాన్‌ హిందూ ఆధిపత్య ధోరణి కలిగిన ఆరెస్సెస్‌ కనుసన్నల్లో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. "నాజీ ఆర్యన్ ఆధిపత్యం వలె హిందూ ఆధిపత్యంతో కూడిన ఆరెస్సెస్ భావజాలంపై తాను కలత చెందుతున్నానని వరుస ట్వీట్లలో ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

ఇది భారత్‌లో ముస్లింలను అణచివేయడానికి దారితీసి చివరికి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జమ్మూ కశ్మీర్‌ పరిణామాలు భారత అంతర్గత వ్యవహారమని భారత్‌ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంతో పాటు తాము తీసుకున్న నిర్ణయాలతో ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం కనుమరుగై ప్రగతి సాధ్యమవుతుందని హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు