చపాతీలు చెయ్యమన్నాడని...

16 Nov, 2015 11:55 IST|Sakshi
చపాతీలు చెయ్యమన్నాడని...

క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఎంతో ముచ్చటపడి చేసుకున్న పెళ్లి ఎందుకు విఫలమైందో తెలుసా? టీవీ జర్నలిస్టు రేహమ్ ఖాన్ (42) అతడి నుంచి ఎందుకు విడాకులు తీసుకుందో తెలుసా? తనను వంటింట్లో చపాతీలు చెయ్యమన్నాడని, బయట కనిపించకూడదని ఆర్డర్ చేసేవాడని ఆమె తెలిపింది. విడాకులు తీసుకున్న పది రోజుల తర్వాత ఆమె ఈ విషయాలు వెల్లడించింది. తాను రాజకీయాల్లోకి వద్దామనుకుంటే ఇమ్రాన్ ఖాన్ వద్దన్నాడంటూ అక్టోబర్ 30వ తేదీన వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు అంతకుముందు జెమీమా గోల్డ్‌స్మిత్ అనే బ్రిటిష్ మహిళతో పెళ్లయ్యింది. వాళ్లిద్దరూ 2004లోనే విడాకులు తీసుకున్నారు.

బీబీసీలో జర్నలిస్టుగా పనిచేసే రేహమ్ ఖాన్‌కు కూడా అంతకుముందే పెళ్లయ్యింది, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. తనను మాత్రం బయటకు రానీయకుండా, వంటింటి కుందేలులా ఉంచేయాలని అనుకున్నాడని ఆమె చెబుతోంది. తన చిన్నకూతురు పెషావర్‌లోని వీధి పిల్లలకు అంబాసిడర్‌గా అయినప్పటి నుంచి ఆమె చదువు అటకెక్కిందని కూడా రేహమ్ తెలిపింది. గృహహింసకు మీరు బలయ్యారా అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. తాను అబద్ధం చెప్పదలచుకోలేదని, బలయ్యానని చెప్పింది. ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్‌ను మీడియా ఎంత ప్రశ్నించినా.. మౌనమే సమాధానం అయ్యింది.

తన గతం గురించి ఇమ్రాన్‌కు తెలిసినా, దాని గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉండేవాడని రేహమ్ చెప్పింది. ఇంటికొచ్చే అతిథులకు ఏమీ పెట్టేవాడు కాదని, అతడు కూడా రోజుకు కేవలం ఒక్క చపాతీ మాత్రమే తినేవాడని తెలిపింది. తాను ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేదాన్ని గానీ ఆయన మాత్రం నోరు విప్పేవాడు కాదంది. ఇంట్లో కర్టెన్ల రంగు గురించి కూడా ఆయనతో మాట్లాడకూడదని, కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని వివరించింది. అలాగే బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడకూడదని, తాను ఎంతగా ప్రయత్నించానో దేవుడికే తెలుసని రేహమ్ చెప్పింది. ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మిస్తున్న ఆమె.. పాకిస్థాన్‌లో వీధిబాలల సంక్షేమం కోసం పని చేస్తూనే ఉంటానంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా