మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్‌ ఖాన్‌

10 Nov, 2019 16:57 IST|Sakshi

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్‌ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్‌ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

అయితే పాక్‌లోని కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవానికి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి బయల్దేరిని యాత్రికుల బృందం కోసం కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు అక్కడి నాయకులు ఎదురు చూశారు. ఈ సందర్బంగా ‘మన సిద్దూ ఎక్కడా’అంటూ ఇమ్రాన్‌ ఆసక్తిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. సిద్దూను మన సిద్దూ అంటూ ఇమ్రాన్‌ సంబోధించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. క్రికెటర్లైన ఇమ్రాన్‌, సిద్దూలు రాజకీయ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్‌లో మాదిరిగానే రాజకీయల్లోకి వచ్చాక కూడా వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇక నిన్నటి కార్యక్రమంలో సిద్దూ పాక్‌ ప్రధానిపై ప్రశంసలు కురిపించాడు. కర్తార్‌పూర్‌ కారిడర్‌ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 

కాగా, కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే పాక్‌ సెనేటర్‌ కూడా సిద్దూపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో సిద్దూకు మంచి సత్ససంబంధాలు ఉన్నాయని, సిద్దూ పాకిస్తాన్‌కు మంచి స్నేహితుడని తెలిపారు. అంతేకాకుండా సిద్దూ పాక్‌పై టెస్టు సెంచరీ సాధించలేదని గుర్తుచేస్తూ.. పాక్‌పై, ఇమ్రాన్‌పై అతడికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు. ఇక సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే 1989-90లో పాక్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సిద్దూ సభ్యుడు. అప్పుడు పాక్‌ జట్టుకు ఇమ్రాన్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. అత్యధికంగా 97 పరుగులు చేశాడు. ఇక పాక్‌ సెనేటర్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు