అయ్యో ఇమ్రాన్‌.. ఉన్నది 47 దేశాలే కదా!?

13 Sep, 2019 17:07 IST|Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ జరిగిన నాటి నుంచి దాయాది దేశం చేస్తోన్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఈ విషయంలో ప్రపంచ దేశాలేవి పాక్‌కు మద్దతివ్వడం లేదు. మరోపక్క జమ్మూకశ్మీర్‌ అంశంలో పాక్‌ ప్రజలు కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లిన చందంగా కశ్మీర్‌ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌నే విశ్వసిస్తున్నాయంటూ పాక్‌ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు ఇమ్రాన్‌ను మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. వీటికి తోడు ఇమ్రాన్‌ ఖాన్‌ సొంత పైత్యం మరిన్ని వివాదాలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనను అడ్డంగా బుక్‌ చేశాయి. మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) సమావేశంలో 58 దేశాలు కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకున్న చర్యలను వ్యతిరేకించాయని పేర్కొని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్‌.

ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం ‘ఈ నెల 10న జెనివాలో జరిగిన యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశంలో ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించాం. భారత ప్రభుత్వం కశ్మీర్‌లో నిర్భందకాండను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాం. అక్కడి ప్రజలపై ఆంక్షలు నిలిపివేయాలిన.. వారి హక్కులను పరిరక్షించాలని కోరాం. పాక్‌ వ్యాఖ్యలను మిగతా దేశాలు సమర్థించాయి. అంతేకాక యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఉ‍న్న 58 దేశాలు పాక్‌కే మద్దతుగా నిలిచాయి’ అంటూ ట్విట్‌ చేసి మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు ఇమ్రాన్‌. ఎందుకంటే యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఉన్నదే 47 దేశాలు. అలాంటిది 58 దేశాలు పాక్‌కు మద్దతెలా ఇచ్చాయంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇమ్రాన్‌ కొత్తగా మరో 11 దేశాలను కనిపెట్టాడు’.. ‘ఇమ్రాన్‌ జాగ్రఫీలోనే అనుకున్నాం లెక్కల్లో కూడా పూరేనా’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు