భారత్‌పై పాక్‌ ఫిర్యాదు

17 Dec, 2018 12:13 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని, తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. కశ్మీర్‌ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కశ్మీర్‌లో ప్రజలు భారత సైన్య చర్యలపై తిరగబడుతున్నారని, వెంటనే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) చేపట్టాలని ఐక్యరాజ్య సమితిని డిమాండ్‌ చేశారు. పూల్వామాలో ఇటీవల చెలరేగిన హింస కారణంగా భారత భద్రతా బలగాల కాల్పుల్లో ఏడుగురు పౌరులతో సహా, ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

భారత ప్రభుత్వం తన సైనిక భలాన్ని ఉపయోగించి కశ్మీర్‌లో మారణాహోమాన్ని సృష్టిస్తోందని ట్విటర్‌ ద్వారా ఇమ్రాన్‌ విషంగక్కారు. పుల్వామాలో భారత సైన్యం చేపట్టిన ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇమ్రాన్‌ తెలిపారు. కాగా ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్న సైన్యంపైకి స్థానికులు భారీగా రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కొరకు బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇదివరకే కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు