గేదెలను అమ్మనున్న ప్రధాన మంత్రి

17 Sep, 2018 20:42 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా సోమవారం ఖరీదైన 34  కార్లను వేలంలో అమ్మేసింది. ఇందులో కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ప్రక్రియను ఇక ముందు కూడా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 102 లగ్జరీ కార్లను ఇలాగే అమ్మాలని ఇమ్రాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం లోటు బడ్జెట్‌లో ఉన్నపాక్‌కి  ఈ డబ్బు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఇమ్రాన్‌ భావిస్తున్నారు.  ఉపయోగంలో లేని నాలుగు హెలికాప్టర్లను కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గేదెలను సైతం వేలం పాడబోతున్నారు
లగ్జరీ కార్లు, హెలికాప్టర్లు మాత్రమే కాదు... మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసిన ఎనిమిది గేదెలకు కూడా వేలం వేయాలని ఇమ్రాన్‌ సర్కార్‌ నిర్ణయించింది. నిరుపయోగంగా ఉన్న ప్రధాని అధికారిక నివాసాలను సైతం వేలం వేయబోతున్నారు. దేశాధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వాధికారులు, నేతలు ఎవరైనా సరే విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణాలు చేయకూడదని ఇమ్రాన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది. ఇప్పటికే పాకిస్తాన్‌ పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పును కలిగిఉంది. 

మరిన్ని వార్తలు