సర్కారు ఏర్పాట్లలో ఇమ్రాన్‌

29 Jul, 2018 03:40 IST|Sakshi

ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలతో పొత్తు చర్చలు

పంజాబ్, ఖైబర్‌ ప్రావిన్సుల్లోనూ పీటీఐ ప్రభుత్వాలే..

పాకిస్తాన్‌లో ఆందోళనలకు విపక్షాల ప్రణాళిక  

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మెజారిటీ కోసం అవసరమైన సీట్లను సంపాదించేందుకు స్వతంత్రులుసహా చిన్న పార్టీలతో చర్చలు ప్రారంభించారు. పార్టీలో తన విశ్వాస పాత్రులకు  పార్టీల, ప్రావిన్సుల బాధ్యతను అప్పజెప్పారు. పీటీఐ నేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశమైన ఇమ్రాన్‌.. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడారు. పాక్‌ నిబంధనల ప్రకారం ఫలితాలొచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు 21రోజుల గడువిస్తారు. ఆలోపే మిగిలిన పార్టీల మద్దతు సంపాదిస్తామని ఇమ్రాన్‌ చెప్పారు.

ఎన్నికల ఫలితాల పూర్తి అధికారిక వివరాలు శనివారం వెల్లడయ్యాయి. మొత్తం 270 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరగగా ఇమ్రాన్‌ నేతృత్వంలోని పీటీఐ 116 స్థానాల్లో గెలిచింది. ఇమ్రాన్‌కు పాక్‌ ఆర్మీ అండగా నిలిచిందంటూ విమర్శలొస్తున్న నేపథ్యంలోనూ ఇమ్రాన్‌ సంపూర్ణమైన మెజారిటీ సాధించలేదు. అటు, పీఎంఎల్‌–ఎన్‌ 64 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు 13 సీట్లు సాధించారు. ఈ స్వతంత్రులే  ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. మిగిలిన 34 సీట్లను చిన్నా, చితకా పార్టీలు గెలుచుకున్నాయి. మొత్తం 272 పార్లమెంటు స్థానాలకు గానూ 270 చోట్ల ఎన్నికలు జరిగాయి.  

పంజాబ్, ఖైబర్‌ల్లోనూ పీటీఐ
పీటీఐ నేతలతో సమావేశమైన ఇమ్రాన్‌ కేబినెట్‌ ఏర్పాటుపై నిర్ణయించేందుకు సమావేశమయ్యారు. పంజాబ్‌ ప్రావిన్సులోనూ ప్రభుత్వ ఏర్పాటుకు పీటీఐ సిద్ధమవుతోంది. పీఎంఎల్‌ఎన్‌ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ఇతర పక్షాలతో కలిసి పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ అంశలపైనా పార్టీ నేతల సమావేశంలో ఇమ్రాన్‌ చర్చించారు. ఇమ్రాన్‌ విశ్వాసపాత్రుడైన జహంగీర్‌ ఖాన్‌కు విపక్ష ఎమ్మెల్యేలతో చర్చించే బాధ్యతను అప్పగించారు. ఖైబర్‌–ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సులో పీటీఐ మెజారిటీని సాధించింది. ఇక్కడ ఇమ్రాన్‌ బాల్యస్నేహితుడైన పర్వేజ్‌ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సింధ్‌లో పీపీపీ మూడింట రెండొంతుల మెజారిటీని సాధించగా.. బెలూచిస్తాన్‌లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు.

ఆందోళనలకు సిద్ధమైన విపక్షాలు
ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఎన్నికలు, కౌంటింగ్‌ పారదర్శకంగా జరగలేదంటూ శుక్రవారం రాత్రి రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన పార్టీలు.. మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. పీఎంఎల్‌–ఎన్‌ చీఫ్, మాజీ ప్రధాని షెహబాజ్, ఎంఎంఏ చీఫ్‌ మౌలానా ఫజ్లుర్‌ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఫలితాలను విపక్షాలు అంగీకరించబోవడం లేదని స్పష్టం చేశాయి. అటు అమెరికా కూడా పాకిస్తాన్‌ ఎన్నికలు స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో జరగలేదని పేర్కొంది. పాకిస్తాన్‌ పరిశీలకులతోపాటు, దక్షిణాసియా రాజకీయ విశ్లేషకులు, పాకిస్తాన్‌లో రాజకీయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్‌ నారెట్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ఆర్మీ ఈ ఎన్నికలను పూర్తిగా ప్రభావితం చేసిందని ఆమె తెలిపారు.

ఉగ్రవాదులకు ఘోర పరాభవం
పాక్‌ ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన గ్రూపులకు ప్రజలనుంచి పూర్తిస్థాయి వ్యతిరేకత ఎదురైంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ మద్దతు తెలిపిన ‘అల్లాహు అక్బర్‌ తెహ్రీక్‌’ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ సంస్థకు కనీసం ఒక్క సీటుకూడా రాలేదు. కనీస పోటీ కూడా కనబరచలేదు. దేశవ్యాప్తంగా ఈ పార్టీ సంపాదించిన ఓట్లు లక్షా 71వేలు మాత్రమే. మరో ఉగ్రవాద సంస్థ పెట్టుకున్న పార్టీ తెహ్రీకే లబాయిక్‌ పాకిస్తాన్‌ పార్టీ సింధ్‌ ప్రావిన్స్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు మినహా దేశవ్యాప్తంగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. తాలిబాన్‌ గాడ్‌ఫాదర్‌గా సుపరిచితుడైన మౌలానా సమీయుల్‌ హక్‌ పార్టీ జమియాత్‌ ఉలేమాయే ఇస్లాం పార్టీ కనీసం ఒక్కసీటు గెలవలేదు. మత, ఉగ్రవాద రాజకీయ పార్టీలపై ప్రజలు ఏ విధమైన అభిప్రాయం కలిగి ఉన్నారో స్పష్టమవుతోందని.. పాక్‌ రాజకీయ నిపుణులంటున్నారు.  

మరిన్ని వార్తలు