మోదీ గెలిస్తేనే మంచిది : పాక్‌ ప్రధాని

10 Apr, 2019 11:05 IST|Sakshi

కశ్మీర్‌ అంశంపై శాంతి చర్చలకు ఆస్కారం

ఈ విషయంలో కాంగ్రెస్‌ భయపడుతోంది

విదేశీ జర్నలిస్టులతో పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌ అంశంపై శాంతి చర్చలు జరగాలంటే మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావాలని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే శాంతి చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ గెలిస్తే శాంతి చర్చలు నిర్వహించడానికి భయపడుతుందని విదేశీ జర్నలిస్టులతో వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది. బీజేపీ గెలిస్తే కశ్మీర్‌ అంశం కొలిక్కి వస్తుందని, కొన్ని సెటిల్‌మెంట్లు జరుగుతాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరిణామాలను తానెప్పుడు ఊహించలేదన్నారు. తనకు భారత్‌లోని చాలా మంది ముస్లింలు తెలుసని, వారి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం వారు హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. 

నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ను తలపిస్తున్నారని, ఆయన తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్‌ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారని, తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్‌కు అవసరమన్నారు. ఇప్పటికే పాక్‌లోని ఉగ్రవాదులను పాక్‌ సైన్యం ఏరివేసిందని, ఈ విషయంలో ప్రభుత్వం వారికి పూర్తి మద్దతిస్తుందన్నారు. మోదీపై వ్యతిరేకత వ్యక్తమైతే.. భారత సైన్యం చేత పాక్‌పై దాడి చేయించే అవకాశం ఉందన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్‌ భూభాగంపై దాడి చేయడం.. పాక్‌ వైమానిక దళం భారత్‌పై దాడులు చేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

>
మరిన్ని వార్తలు