భారత్‌ తిరస్కరణ నిరాశ కలిగించింది: పాక్‌ ప్రధాని

22 Sep, 2018 16:03 IST|Sakshi
ఇమ్రాన్‌ ఖాన్‌, నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫొటో)

కరాచీ : భారత్‌తో శాంతి చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. భారత్‌–పాక్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలను పునరుద్దరించాల్సిందిగా ఇమ్రాన్‌ ఖాన్‌ రాసిన లేఖను భారత్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘శాంతి కోసం చర్చలకు రావాలని నేను రాసిన లేఖకు భారత్‌ నుంచి అహంకారపూరిత ప్రతికూల స్పందన రావడం నిరాశ కలిగించింది. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు.’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక కశ్మీర్‌ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, ముగ్గురు ఎస్పీవోలను పాక్‌ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్‌ ఈ చర్చలను రద్దు చేసుకుందన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల భారత్‌కు రాసిన లేఖలో ప్రతిపాదించారు. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలెలా జరపుతామని భారత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

మరిన్ని వార్తలు