భారత్‌ కావాలనే మమ్మల్ని టార్గెట్‌ చేస్తోంది: ఇమ్రాన్‌

7 May, 2020 12:46 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. కశ్మీర్‌లో చెలరేగుతున్న హింసకు స్థానిక పరిస్థితులే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను ఉపయోగించుకుని తమపై విద్వేషం చిమ్మే అవకాశం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాక్‌ అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దాయాది దేశానికి సరైన బుద్ధి చెబుతామంటూ భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే హెచ్చరించిన విషయం తెలిసిందే. కశ్మీరీల స్నేహితుడని చెప్పుకొనే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ లోయలో మారణకాండ సృష్టిస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఊతమిస్తూ హింసను ప్రోత్సహిస్తున్న పాక్‌కు ధీటుగా బదులిమస్తామని పేర్కొన్నారు.(పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్‌)

ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. తమ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని... ఈ పరిణామాలను అంతర్జాతీయ సమాజం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా... కశ్మీరీలను భారత్‌ అణచివేతకు గురిచేస్తోందని.. ఇందుకు ఆరెస్సెస్‌, బీజేపీ భావజాలం కారణం అంటూ ఆరోపించారు. భారత్‌ చర్యలు మారణహోమం సృష్టించేవిగా ఉన్నాయని.. ఇది దక్షిణాసియా భద్రతను ప్రమాదంలోకి నెట్టివేస్తుందంటూ రెచ్చిపోయారు. కాగా ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ డీ ఫాక్టో చీఫ్‌ రియాజ్‌ నైకూ (32)ను భారత్‌ బుధవారం మట్టుబెట్టిన క్రమంలో పాక్‌ ప్రధాని ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. (హిజ్బుల్‌ కమాండర్‌ హతం)

ఇక తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్న పాక్‌... 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ సహా 1800 మంది ఉగ్రవాదుల పేర్లను తన నిఘా జాబితా నుంచి ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మనీల్యాండరింగ్‌ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తదుపరి మదింపునకు ముందు పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. తద్వారా ఉగ్రవాదుల పట్ల తమ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేసింది.(పాకిస్తాన్‌లో వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు)

మరిన్ని వార్తలు