‘పుల్వామా ఉగ్రదాడితో పాక్‌కు సంబంధం లేదు’

24 Jul, 2019 14:21 IST|Sakshi
ఇమ్రాన్‌ ఖాన్‌

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ 

వాషింగ్టన్‌ : భారత్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు సంబంధంలేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఈ దాడి భారత్‌ అంతర్గత సమస్యతో కశ్మీర్‌ ప్రజలు చేసిన పనేనన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ కేంద్రంగా ఏర్పడిన జైషే ఈ మొహమ్మద్‌ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అంగీకరించడంతో తమ దేశం బదనాం అయిందన్నారు. కానీ ఈ దాడితో పాక్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జైషే మోహమ్మద్‌ పాక్‌ చెందినదే అయినప్పటికి అది కశ్మీర్‌లో కూడా ఉందని, భారత్‌లోని సమస్యలతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు.

‘భారత భద్రతా బలగాల వేధింపులకు గురైన ఓ కశ్మీర్‌ యువకుడే తిరుగుబాటు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కానీ ఈ దాడి పాకిస్తాన్‌ చేయించినట్లు ప్రచారం జరిగింది’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌పై భారత వాయుసేన ప్రతీకారదాడులు చేపట్టడం.. పాక్‌ కూడా దాడులు చేసే ప్రయత్నం చేయడం.. తదానంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే.  

అమెరికాలో పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కావాలని భారత్‌, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు.  అక్కడే ఉన్న ఇమ్రాన్‌ ట్రంప్‌ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్‌ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌లో పెనుదుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు