కశ్మీర్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు

17 Jan, 2020 16:30 IST|Sakshi

ఇ‍స్లామాబాద్‌ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను ఆక్రమించాలంటూ భారత్‌లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కశ్మీర్‌, పీఓకే అంశాలపై మాట్లాడారు. పీఓకేను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అక్కడి ప్రజలు కోరుకుంటే ప్రజాభిప్రాయసేకరణ (రిపరెండమ్‌) నిర్వహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు. పాక్‌ ఆధీనంలోకి కశ్మీర్‌తో పోల్చుకుంటే భారత్‌లోని కశ్మీర్‌లోని మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్‌-భారత్‌లోని కశ్మీర్‌లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నానని పాక్‌ ప్రధాని పేర్కొన్నారు.

‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాను. అప్పుడే భారత్‌-పాక్‌ సంబంధాలను పునరుద్ధరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కానీ దురదృష్టవశాత్తు మోదీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పనిచేస్తోంది. హిట్లర్‌ అనుసరించిన నాజీయిజం సిద్ధాంతాలను ఆర్‌ఎస్‌ఎస్‌ పాటిస్తోంది. దానిలో భాగంగానే పాక్‌తో చర్చలకు భారత్‌ దూరంగా ఉంటోంది. కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా భారత ప్రభుత్వం గత ఏడాది ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. భారత్‌ ఆధీనంలోని కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన విపరీతంగా సాగుతోంది. కానీ భారత్‌ ఆరోపిస్తున్నట్లు పీఓకేలో ఘర్షణ వాతావరణం లేదు. అక్కడ పరిస్థితి ఎప్పుడూ సాధారణంగానే ఉంటుంది. అక్కడి ప్రజలు కోరుకుంటే రెపరెండమ్‌ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించవచ్చు’ అని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు